Thu Dec 19 2024 00:35:18 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla : కల్వకుంట్ల కుటుంబానికి నేడు గుడ్ న్యూస్ అందనుందా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పై ఈరోజు విచారణ జరగనుండటంతో కల్వకుంట్ల కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ట్రయల్ కోర్టులో...
అనేక సార్లు కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసినా ఫలితం లేదు. నిరాశే ఎదురయింది. ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. కవిత కూడా మధ్యంతర బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేస్తే అందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే కవిత ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరుపున న్యాయవాదులు వాదనలు చేస్తూ వస్తున్నారు.
బెయిల్ వస్తుందని...
కవిత సోదరుడు కేటీఆర్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చి న్యాయనిపుణులతో చర్చించారు. కవితకు బెయిల్ వస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో నేడు కవితకు బెయిల్ వస్తుందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కవిత దాదాపు ఆరు నెలల నుంచి తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఈడీ, సీబీఐలు మాత్రం కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత తరుపున న్యాయవాదులు ఏ మేరకు తమ వాదనలను వినిపించి బెయిల్ వచ్చేలా చూస్తారన్నది వేచిచూడాలి.
Next Story