Wed Jan 08 2025 17:41:39 GMT+0000 (Coordinated Universal Time)
Caste Census : కులగణనలో వాస్తవాలు చెబుతున్నాారా? దాచి పెడుతున్నారా?
తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభమయింది. ప్రజలు సమాచారం మాత్రం అందించడం లేదు
తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభమయింది. ఈ నెల మొదటి వారంలో ప్రారంభమయిన కులగణన కార్యక్రమం ప్రభుత్వం ఆశించినంత రీతిలో జరగడం లేదని సమాచారం. అనేకమంది సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, వాస్తవ సమాచారాన్ని తెలపకుండా దాట వేస్తున్నారని అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దీంతో అసలు కులగణన వల్ల నిజాలు బయటకు వస్తాయా? ప్రభుత్వానికి వాస్తవాలు తెలుస్తాయా? అన్న సందేహం కూడా పాలకుల్లో నెలకొంది.
బీసీ కులాల కోసమే అయినా…
నిజానికి బీసీ కులాల కోసం కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 30వ తేదీ వరకూ కులగణన సర్వే చేయనుంది. ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగా నియమించారు. అయితే ఎక్కువ ప్రశ్నలు ఉండటంతో పాటు వ్యక్తిగత ప్రశ్నలు కూడా అనేక అనుమానాలకు కారణమవుతున్నాయి. ఆస్తుల వివరాలతో పాటు అనేక అంశాలను ఎన్యుమరేటర్లు వేస్తుండటంతో ప్రజలు చెప్పేందుకు నిరాాకరిస్తున్నారు. ప్రధానంగా ఆధార్ కార్డుతో పాటు ఫోన్ నెంబరు ఇచ్చేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు.
సంక్షేమ పథకాలను కట్ చేస్తారేమోనని...
ఏసీ, ఫ్రిజ్ వంటి వివరాలను కూడా అడుగుతుండటంతో కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. తమకు పూర్తి స్థాయిలో వివరాలు చెబితే సంక్షేమ పథకాలను కట్ చేస్తారేమోనన్న భయంతోనే ఈ రకమైన ప్రశ్నలకు సమాధానాలను ప్రజలు దాట వేస్తున్నట్లు తెలిసింది. తమ ఆస్తుల గురించి మీకెందుకు? ఆధార్ నెంబరు అవసరమేంటి? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వెనువెంటనే వస్తుండటంతో ఎన్యుమరేటర్లు కూడా ఏమీ చేయలేని నిన్సహాయ స్థితిలో ఉన్నారు. సమాధానాలు చెప్పడం కంపల్సరీ కాకపోవడంతో సర్వే కు వెళ్లిన వారు కూడా ఇక చేసేదేమీ లేక వారు చెప్పిన సమాధానాలను నోట్ చేసుకుని వెనుదిరుగుతున్నారు. అయితే రాష్ట్రంలో 97 శాతం సర్వే పూర్తయిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, హైదరాబాద్ నగరంలో మాత్రం సర్వే నత్తనడకన సాగుతుంది.
వ్యక్తిగత వివరాలను…
ఎప్పుడైనా ఎవరైనా తమ వ్యక్తిగత వివరాలను ఇచ్చేందుకు ప్రజలు ఇష్టపడరు. అది ప్రభుత్వమైనా కావచ్చు. ప్రయివేటు సంస్థ అయినా కావచ్చు. తమ పొలాలు, ఇల్లు వంటి వివరాలు చెబితే వచ్చే పథకాలు అందవని, తెలుపు రంగు రేషన్ కార్డు కూడా రద్దవుతుందేమోనన్న ఆందోళనతో అనేక మంది పూర్తి స్థాయిలో వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మరొక వైపు సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ విషయాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తాము సమాధానం చెప్పిన తర్వాత జరిగే నష్టానికి ఎవరు బాధ్యులంటూ తిరిగి ఎన్యుమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో గత కొంతకాలంగా జరుగుతున్న కులగణన సర్వే ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తుందా? అన్న అనుమానాలు అధికార పార్టీలోనూ నెలకొనడం విశేషం. ప్రధానంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పూర్తి వివరాలు ఇవ్వడం లేదని తెలిసింది.
Next Story