Mon Dec 23 2024 11:04:27 GMT+0000 (Coordinated Universal Time)
కొండెక్కుతున్న కోడి.. కొనేదెలా ? తినేదెలా ?
ఇప్పటికే డిమాండ్ కు తగిన దిగుబడి లేకపోవడంతో.. కిలో కందిపప్పు ధర ఏకంగా రూ.140కి చేరింది. ఇప్పుడు చికెన్ ధర..
మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం.. మాంసాహార విక్రయాలపై, నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతున్నాయి. వేసవిలో వచ్చిన అకాల వర్షాలు రైతులకు తీరని పంటనష్టాలను తెచ్చిపెట్టాయి. ఇప్పటికే డిమాండ్ కు తగిన దిగుబడి లేకపోవడంతో.. కిలో కందిపప్పు ధర ఏకంగా రూ.140కి చేరింది. ఇప్పుడు చికెన్ ధర కూడా అమాంతం పెరిగిపోయింది. ఆదివారం వస్తే చాలు.. ముక్కలేనిదే ముద్దదిగదు చాలామందికి. ఎలాంటి వారైనా సరే.. ఆదివారం కనీసం రూ.100 చికెన్ అయినా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు వాటి ధరలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ.30-50 మేర పెరిగింది.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు చనిపోవడంతో.. దాని ప్రభావం చికెన్ విక్రయాలపై పడుతోంది. ఏప్రిల్ 1న కిలో చికెన్ ధర రూ.154 ఉండగా.. ఇప్పుడు రూ.200కి చేరింది. మే 19 నాటికి మార్కెట్ లో స్కిన్ చికెన్ కిలో రూ.213 ఉండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ.243కి చేరింది. వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా 40-60 శాతం కోడిపిల్లలు చనిపోవడం వలనే చికెన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దానితో పాటు కోళ్ల దాణా, రవాణా ఖర్చు కూడా భారీగా పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎంత ధర పెరిగినా.. చికెన్ ప్రియులు మాత్రం కొనుగోళ్లు చేస్తున్నారు.
Next Story