Mon Dec 23 2024 16:23:22 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : చంద్రబాబు కంటే ముందుండేందుకు రేవంత్ రెడ్డి పెద్ద ప్లాన్ వేశారుగా?
ఏపీకి పరిశ్రమలు తరలి వెళ్లే ప్రమాదముందని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే జాగ్రత్త పడ్డారు
పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఐదు పదుల రాజకీయ అనుభవం ఆయనది. అందులోనూ లాబీయింగ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ కు తరలించుకు వెళ్లడంతో చంద్రబాబు ముందుంటారు. చంద్రబాబు ఇంకా పాలనలో కుదురుకోలేదు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, దాని నుంచి బయట పడే మార్గాల కోసమే అన్వేషిస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడిప్పుడే ఆయన పరిశ్రమల గురించి ఆలోచించే తీరిక లేదు. అంత ఆలోచన కూడా చేయడానికి ఆయన ముందుకు రారు.
ఏపీకి పరిశ్రమలు వెళ్లకుండా...
అయితే ఆయన బయలుదేరితే ఏపీకి పరిశ్రమలు తరలి వెళ్లే ప్రమాదముందని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే జాగ్రత్త పడ్డారు. తెలంగాణలోని హైదరాబాద్ కంటే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారంటే అది తన ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతుంది. విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మధ్య పోలిక పెట్టి ప్రత్యర్థులు తమను, తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశముంది. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే ముందుగానే ఆయన మేల్కొన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆయన ఒక అడుగు ముందే ఉండాలని నిర్ణయించుకున్నారు.
అవగాహన ఒప్పందాలు...
ఈ నేపథ్యంలోనే ఆయన హడావిడిగా పది రోజుల పాటు అమెరికా టూర్ పెట్టుకున్నారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ప్రధానంగా కాగ్నిజెంట్ విస్తరణ ఒప్పందం కుదరడం రేవంత్ పర్యటనలో హైలెట్ గా చెప్పుకోవాలి. పదిలక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ హైదరాబాద్ లో కొత్త సెంటర్ ను నెలకొల్పేందుకు అంగీకరించింది. దీనివల్ల పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు మిగిలిన సంస్థల సీఈవోలతోనూ భేటీ అయి ఎంవోయూలను రేవంత్ కుదుర్చుకుంటున్నారు. పారిశ్రామక వేత్తలు, ఎన్ఆర్ఐలతో సమావేశమై తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంపెనీలను తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని...
మరోవైపు స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి దానికి ఛైర్మన్ గా ఆనంద్ మహీంద్రను నియమించడంతో మంచి సంకేతాలు వెళ్లాయి. నిరుద్యోగుల్లోనూ, పారిశ్రామికవేత్తల్లోనూ ఇది గుడ్ సిగ్నల్స్ వెళ్లడంతో ఒకరకంగా ఏపీ కంటే తెలంగాణ పై చేయి సాధించినట్లే. స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కూడా రేవంత్ సక్సెస్ కావడానికి ఒక కారణం. నిరుద్యోగ యువతకు అథునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉపాధి కల్పన కూడా బాగా పెరుగుతుందని ఆశిస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో చంద్రబాబు కంటే రెండడుగులు ముందు ఉన్నారని తెలంగాణవాసులకు రేవంత్ చెప్పకనే చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు ఆలోచనల కంటే ముందుగానే రేవంత్ స్పీడ్ గా వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Next Story