Wed Dec 25 2024 08:03:34 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కేసీఆర్ ను ఇక లేవనివ్వను.. వరంగల్ సభలో రేవంత్
వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు పోటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు పోటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ లో జరిగిన ఇందిరా శక్తి సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి కాళోజీ కళాక్షేత్రాన్నినిర్మించడానికి పదేళ్లు అయినా చేతులు రాలేదని అన్నారు. వరంగల్ లో ఒకే ఒక ఎయిర్ పోర్టు ఉందని, వరంగల్ లో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కాంగ్రెస్ లో ఇద్దరు మహిళ మంత్రులు కేబినెట్ లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళ మంత్రి లేరన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి పట్టణాల అభివృద్ధిపై తమ ప్రభుత్వం పోకస్ పెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
పది నెలల్లో తెలంగాణ...
పది నెలల్లో తెలంగాణ ఏమీ కోల్పోలేదన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఖర్చుకు వెరవకుండా మహిళల కోసం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో అనేక ఎయిర్ పోర్టులున్నాయని, తెలంగాణకు ఒక్క ఎయిర్ పోర్టు మాత్రమే ఉందని ఆయన అన్నారు. మనకు కూడా అన్ని నగరాల్లో ఎయిర్ పోర్టులు కావాలని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్ కేవలం వారి ఇంట్లో నలుగురు ఉద్యోగులు కోల్పోయారని, అంతే తప్ప తెలంగాణకు నష్టం ఏమీ జరగలేదన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం...
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. ఇందుకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఇంకా కొందరికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని, వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నానని, అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత తనది అని ఆయన తెలిపారు. ఎవరో తప్పుడు మాటలు చెబితే వారి మాటలు నమ్మవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. బిర్లా రంగాలు ఇద్దరూ రోజూ మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. 18,500 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుంటే 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు, మరో 6,500 కోట్లు గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామని తెలిపారు.
సోనియా కాళ్లు కడిగి...
అరవై ఏళ్ల ఆంకాంక్షను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు ఊడిగం చేసినా తప్పులేదని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియమ్మ కాళ్లు కడిగి ఈ నీళ్లను నెత్తిమీద చల్లుకుంటే కొంత వరకయినా పాప ప్రక్షాళన జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ మొక్కను మళ్లీ మొలవనివ్వనని రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఫామ్ హౌస్ లో పడుకుంటే తనకు తెలియదని అనుకుంటున్నాడేమోనని, కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చానని, పడిపోయిన బీఆర్ఎస్ పార్టీని ఇక లేవనివ్వనని రేవంత్ రెడ్డి తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story