Sun Dec 22 2024 18:19:01 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కౌలు రైతులకు ఖుషీ కబురు.. రైతు భరోసాలో ప్రభుత్వం కొత్త నిర్ణయం?
రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటకే అనేక సార్లు ప్రకటించిన ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగా అవసరమైన నిధులను సమీకరించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కింద జనవరి నెల రెండో వారంలో రైతుల ఖాతాల్లో జమ ప్రారంభమవ్వడం జరగాలని ముఖ్యమంత్రి అధికారులను గట్టిగా కోరారు. విడతల వారీగా జమ చేస్తారా? లేక అందరికీ ఒకేసారి జమ చేస్తారా? అన్న దానిపై రాబోయే వారం రోజుల్లో క్లారిటీ రానుంది. నిధులు అందుబాటులో ఉండేదాన్ని బట్టి ఒకేసారి రైతు భరోసా నిధులను జమ చేయాలా? లేక దశలవారీగా రుణమాఫీలాగా చేయాలా? అన్నది మాత్రం నిర్ణయించలేదు.
ఎకరానికి 7,500 రూపాయలు...
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతులకు అందచేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తొలి విడతగా ఎకరానికి 7,500 రూపాయలు చెల్లించేందుకు సిద్ధమయింది. ఇప్పటి వరకూ రైతు భరోసా నిధులు అందకపోవడంతో కొంత అసంతృప్తి రైతుల్లో ఉందని గమనించిన ప్రభుత్వం ఏడాది పాలన అయిన సందర్భంగా దానిని వెంటనే జమ చేయాలని నిర్ణయించింది. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడంతో దీనికి ముహూర్తం కూడా నిర్ణయించడంతో ఇక రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్న నమ్మకం కొంత వరకూ అన్నదాతల్లో ఏర్పడింది. గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చినప్పటికీ తగిన సమయంలో ఇవ్వడంతో తాము విత్తనాలు, పురుగు మందులు, ఎరువులుకొనుగోలు చేయడానికి ఉపయోగపడ్డాయని రైతులు చెబుతున్నారు.
రైతు భరోసా నిధులు ఇచ్చేదెవరికి?
అయితే ఇప్పటికే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను చెల్లించేవారికి రైతు భరోసా నిధులు జమచేయకూడదని నిర్ణయం మాత్రం తీసుకుంది. దీంతో పాటు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వాలని, పది ఎకరాలు దాటిన వారికి అవసరం లేదన్న అభిప్రాయం కూడా ప్రభుత్వంలో వ్యక్తమవుతుంది. అలాగే కేవలం సాగవుతున్న భూములకు మాత్రమే ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా సాయం ఇప్పుడే అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. మరి కౌలు రైతులకు ఏ రకంగా సాయం చేస్తారన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కౌలు రైతులకు... కూలీలకూ...
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అయితే కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని తెలిపింది. మరి ఈ రెండు విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కౌలు రైతుల లెక్క తేలాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో అందరికీ ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. గత ప్రభుత్వంలో అనర్హులు కూడా రైతు భరోసాను అందుకున్నారని, అలా కాకుండా అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశముంది.
Next Story