Mon Dec 23 2024 16:31:23 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : తాము పాలకులం కాదు.. ప్రజా సేవకులం
తాము పాలకులుగా చెప్పుకోవడం లేదని, ప్రజా సేవకులమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
తాము పాలకులుగా చెప్పుకోవడం లేదని, ప్రజా సేవకులమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణవాదుల తత్వమని అన్నారు. రాజకీయ విమర్శల జోలికి పోనంటూనే గతపదేళ్లుగా పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. విధ్వంసం జరిగిందన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనను తెచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి మున్సిపల్ కౌన్సిలర్ వరకూ అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడానికే మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు.
పదేళ్ల పాటు...
గతంలో ప్రగతి భవన్ కు ఎంట్రీ ఉండేది కాదని, నేడు ప్రజాభవన్ తలుపులు నిరంతరం తెరిచి ఉంటున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మను గుర్తు చేసుకోవాలన్నారు. ఆమెను విస్మరిస్తే పుట్టగతులుండవని అభిప్రాయపడ్డారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలంగాణను ఇచ్చిన సోనియాను ఈ వేడుకలకు ఆహ్వానిస్తే కొందరు విమర్శిస్తున్నారని, ఏ హోదాలో సోనియాను పిలుస్తున్నారని అడుగుతున్నారని, వారందరికీ తాను ఒకే సమాధనం చెబుతానని, బిడ్డ ఇంట్లో వేడుకలకు రావడానికి తల్లికి హోదా కావాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అదే తల్లిని తన కుటుంబంలో జరిగే వేడుకకు బిడ్డ ఆహ్వనించడం తప్పా? అని ప్రశ్నించారు.
ప్రజాపాలన...
పదేళ్లలో ప్రజాపాలన అంటూ లేకుండా పోయిందని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర చిహ్నాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని కూడా ప్రజల ముందుకు తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. తర్వాత వివిధ రంగాల్లో అవార్డులు పొందిన అధికారులను రేవంత్ రెడ్డి సత్కరించారు. అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు హాజరయ్యారు. వేడుకగా ఈకార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.
Next Story