Thu Jan 02 2025 20:29:36 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : మూసీ ప్రాజెక్టుపై వెనక్కు తగ్గని సీఎం.. ముందుకు వెళ్లేందుకే నిర్ణయం
మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో కనిపిస్తున్నారు. విమర్శలను లెక్క పెట్టదలచుకోలేదు
మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో కనిపిస్తున్నారు. విమర్శలను లెక్క పెట్టదలచుకోలేదు. ఆయన అనుకున్న ప్రాజెక్టును గ్రౌండ్ చేయడానికే సిద్ధమయ్యారు. మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమే కాకుండా వారికి సరైన వసతికల్పించడంలోనూ రేవంత్ రెడ్డి అంతే స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మూసీ ప్రాజెక్టు వల్ల ఇళ్లుకోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం కావచ్చు. భవనాలు కోల్పోయిన వారికి అదే ప్రాంతంలో రెండు వందల చదరపు గజాల స్థలాన్ని ఇవ్వడంలోనూ రేవంత్ రెడ్డి అధికారులకు క్లిస్టర్ క్లియర్ ఆదేశాలు జారీ చేశారు.
అంత సులువు కాకున్నా...
మూసీ నది ప్రాజెక్టును సుందీకరణ చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే అధిక ఖర్చుతో కూడుకున్న పని. అదే సమయంలో పదివేల నివాసాలను కూడా తొలిగించాల్సి ఉంటుంది. పక్కా భవనాలను తొలగించి వాటి స్థానంలో లబ్దిదారులకు ఊరట కల్గించే ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు ఎన్నో ఎదురవుతాయి. ఆందోళనలు జరుగుతాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఆందోళనలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ పోలీసు కమిషనర్ ఆంక్షలు విధించారు. అయినా సరే అవరమైతే అన్ని చర్యలు తీసుకుని రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించి ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు.
వెనకడుగు వేయకుండా...
ఇప్పటికే అనేక హర్డిల్స్ దాటుకుని వచ్చామని, ఇక వెనకడుగు వేయవద్దని అధికారులను రేవంత్ ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు నెలరోజుల్లో మూసీ ప్రాజెక్టులు డిజైన్లు కూడా సిద్ధం చేయాలని ఆదేశించారని సమాచారం. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు సుందరీకరణ ఒక ఫేజును రెండేళ్లలో పూర్తి చేసేలా రేవంత్ అడుగులు వేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు ఏవైనా తలెత్తినా వెంటనే వాటికి సంబంధించి లబ్దిదారులతో నేరుగా చర్చించి పరిష్కరించాలని కూడా రేవంత్ స్పష్టమైన ఆదేశాలను అధికారులకు చేశారు. ఎక్కువ శాతం వారి సమ్మతితోనే కూల్చివేతల కార్యక్రమం జరగాలని కూడా ఆదేశించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టును వీలయినంత త్వరగా గ్రౌండ్ చేయాలని భావిస్తున్నారు.
కొత్త ఏడాది నాటికి...
బహుశ కొత్త ఏడాది ఈ మూసీ పునరుజ్జీవం పనులు వేగం అందుకుంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సియోల్ తరహాలో సుందరంగా ఉండాలని, అందంగా తయారు చేయాలని, మూసీ నది నీటిని శుద్ధి చేయడమే కాకుండా చుట్టు పక్కల భారీ భవంతులు అవి కూడా ఎక్కువగా కమర్షియల్ భవనాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటు సుందరీకరణ, అటు ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రాజెక్టు డిజైన్లపై స్పష్టత రానుంది.
Next Story