గల్ఫ్ హామీల అమలు కోసం కుంతియా చొరవ
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలు కోసం తాను చొరవ తీసుకుని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా గురువారం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలు కోసం తాను చొరవ తీసుకుని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా గురువారం తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో పాటు అత్యవసరంగా
గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి జీ.ఓ. విడుదల గురించి ప్రత్యేకంగా సీఎంతో చర్చిస్తానని అన్నారు.
కుంతియా హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా టిపిసిసి ఎన్నారై సెల్ బృందం గోల్కొండ హోటల్ లో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా ఏడు సంవత్సరాలు సేవలందించి పార్టీ బలోపేతానికి కృషి చేసి నేటి గెలుపుకి బాటలు వేసిన కుంతియాను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, గంగుల మురళీధర్ రెడ్డి, బాడాల జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు ప్రొ. ఆల్దాస్ జానయ్య లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.