Mon Dec 23 2024 11:48:34 GMT+0000 (Coordinated Universal Time)
ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్ దంపతులు.. కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్
ఎండోస్కోపీ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించి.. ఆయనకు పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యులు వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె వెంటే సీఎం కేసీఆర్ కూడా వెళ్లారు. వైద్యులు శోభతో పాటు సీఎం కేసీఆర్ కు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ కూడా కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు.
సీఎం కేసీఆర్ కు ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఎండోస్కోపీ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించి.. ఆయనకు పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యులు వెల్లడించారు. మిగతా వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే వచ్చాయని వివరించారు. ఈ మేరకు ఏఐజీ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. కాగా.. తల్లి అస్వస్థతకు గురైందని తెలిసి ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులతో మాట్లాడి.. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుసుకుని తిరిగి తన నివాసానికి వెళ్లిపోయారు.
ఈ రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్తో కవిత భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగిందనే దానిపై చర్చించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు వెళ్లడంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపట్లోనే శోభ అస్వస్థతకు గురయ్యారు.
Next Story