ముహూర్తం చూసుకునే ప్రకటిస్తున్నానని చెప్పిన సీఎం కేసీఆర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుండి 105 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుండి 105 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం నాడు 115 మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. మంచి ముహుర్తం ఉన్నందున ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు. అభ్యర్థుల జాబితాలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అవసరాన్ని బట్టి అభ్యర్థులను మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోట్లాడడం ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని కేసీఆర్ చెప్పారు. తమకు ఎన్నికలంటే పవిత్ర కర్తవ్యంగా భావిస్తామన్నారు. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇంకా కొంత అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ లో ఉంచినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.