Tue Nov 05 2024 19:53:54 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లపై దేశద్రోహం కేసు ఎత్తివేయండి : కేసీఆర్ ఆదేశాలు
గతేడాది ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ప్రొఫెసర్ హరగోపాల్తోపాటు 152 మంది ఉద్యమకారులు..
పౌరహక్కుల నేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరులపై నమోదైన దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు వారిపై ఉపా కేసులు ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ప్రొఫెసర్ హరగోపాల్తోపాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై దేశద్రోహం కేసు నమోదయింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదయ్యాయి. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్, ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు పలువురిపై దేశద్రోహం కేసులు పెట్టడాన్ని సీపీఐ తో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. దాంతో ఆ కేసుల్ని ఎత్తివేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని మద్దతు తెలిపారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశానికి తెలిసే విధంగా ఆయన ప్రసంగాలు చేశారని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.
Next Story