Fri Dec 20 2024 18:25:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీతో కలిసుంటే తెలంగాణ అభివృద్ధి అసాధ్యం : సీఎం కేసీఆర్
తెలంగాణను మనందరం సమిష్టి కృషితో సాధించి, నేడు అద్భుత ఫలితాలను సాధిస్తున్నామని, అందులో ఎలాంటి అనుమానం..
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశమంతటికీ మోడల్ గా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నేడు నిర్మల్ లో కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం.. సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. చక్కటి సమీకృత పరిపాలన భవనాన్ని నిర్మింపజేసి నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.
తెలంగాణను మనందరం సమిష్టి కృషితో సాధించి, నేడు అద్భుత ఫలితాలను సాధిస్తున్నామని, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజించబడి.. ప్రజలకు పరిపాలన మరింత చేరువైందన్నారు. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు.. అందులోనూ ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందంటే అందుకు కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమేనన్నారు. ఏపీతో కలిసి ఉంటే మరో 50 ఏళ్లకు కూడా ఈ మెడికల్ కాలేజీ వచ్చేది కాదని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.
జిల్లాకు చెందిన ముక్కుర.కె గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు పొంది తెలంగాణకు గౌరవం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళిత జాతి, గిరిజన జాతి, వెనుకబడి తరగతుల్లో ఉన్న నిరుపేదలను కూడా సమాన స్థాయికి తీసుకురావాలంటే ఇదే పట్టుదల, కృషితో ముందుకు సాగాలన్నారు. ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి సరిపోదన్న కేసీఆర్.. ముందు ముందు చేయాల్సిన అభివృద్ధి చాలానే ఉందన్నారు. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది నుంచి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి.. భవిష్యత్ కోసం పురోగమించాలి. బాగా కష్టపడి పేదరికాన్ని తరిమేసి.. దేశానికే తలమానికంగా నిలవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Next Story