రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి, పింఛన్లకు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ ప్రయోజనం పొందుతున్న వారి ఖాతాల్లో యథావిధిగా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.