బీఆర్ఎస్ మేనిఫేస్టోతో భగ్గుమన్న కాంగ్రెస్.. కారణం ఏంటంటే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హడావుడి ఊపందుకుంది. వివిధ రాజకీయ పార్టీలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హడావుడి ఊపందుకుంది. వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు జాబితాను విడుదల చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే అలాగే ఎన్నికల సందర్భంగా పార్టీలో తమతమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఆదివారం బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికార బీఆర్ఎస్ కాఫీ కొట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హామీలను అటు ఇటూ మార్చి గులాబీ పార్టీ మ్యానిఫెస్టో రూపొందించిందంటూ రేవంత్రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమేనా?
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అలా విడుదలైందో లేదో పోలికలు మొదలయ్యాయి. మ్యానిఫెస్టో గురించి బీఆర్ఎస్ నేతలు చాలా గొప్పలు చెప్పారని తీరా చూస్తే అది తమ ఆరు గ్యారెంటీలకు కాపీగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. తమ గ్యారెంటీలను కాపీ కొట్టాలనే ప్రయత్నంలో కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారని రేవంత్ ఆరోపించారు. తమ మహాలక్ష్మి, ఇందిరమ్మ భరోసా, ఆరోగ్య భరోసా పథకాలకు నకలుగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కనిపిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పాత హామీలతో ప్రజలను మళ్లీ బురిడి కొట్టించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని రేవంత్ అన్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా పోట్లాడేందుకు కేసీఆర్ సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేసేందుకు సిద్ధం కావాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. మొత్తానికి అదికార పార్టీ మ్యానిఫెస్టో విడుదలతో అసలైన రాజకీయం తెలంగాణలో మొదలైంది.