Mon Nov 18 2024 00:49:06 GMT+0000 (Coordinated Universal Time)
Big News : హైదరాబాద్ లో చాప కింద నీరులా కాంగ్రెస్-టీడీపీ దోస్తీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ఆయా పార్టీలు తమవంతు ప్రయత్నాలను
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ఆయా పార్టీలు తమవంతు ప్రయత్నాలను చేస్తూ ఉన్నాయి. గత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఈసారి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. ఆఖరి నిమిషంలో టీడీపీ ఎన్నికల నుండి తప్పుకుంది. అయితే టీడీపీకి పట్టు ఉన్న చాలా ప్రాంతాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. అలాగే ఏ పార్టీకి అధికారికంగా మద్దతు ఇవ్వడం లేదు.
ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ రోడ్ షో చేపట్టారు. ప్రియాంక గాంధీ రోడ్ షోలో కాంగ్రెస్, సీపీఐతో పాటు టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రియాంక గాంధీ రోడ్లో పసుపు జెండాలు ఎక్కువ సంఖ్యలో కనిపించాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని టీడీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. అందుకే అనధికారికంగా కాంగ్రెస్కు బహిరంగంగానే టీడీపీ మద్దతు ఇవ్వడంతో పాటు ప్రచారంలో కూడా పాల్గొంటూ ఉన్నారు. బైక్ లకు ఒక వైపు కాంగ్రెస్ జెండా.. మరో వైపు టీడీపీ జెండాలతో ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోనే కాకుండా.. పాలేరులో కూడా కమ్మ సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీ అనుకూల ఓట్లు కాంగ్రెస్ వైపు ఉన్నారని భావిస్తూ ఉన్నారు.
ఇక చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం మద్దతుదారులను తమ వైపు తిప్పుకోడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునేందుకు గతంలో తెలుగుదేశంతో తమకున్న అనుబంధాన్ని, ఆ పార్టీలో పనిచేసిన రోజులను గుర్తుచేస్తున్నారు కొందరు నాయకులు. ప్రచార ర్యాలీల్లో టీడీపీ జెండాలు ఉండేలా చేసుకుంటూ ఉన్నారు. ఏపీని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా టీడీపీకి బాగా పట్టు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట సెగ్మెంట్లలో టీడీపీ కేడర్ బలంగా ఉంది. భారీగా టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. వారందరినీ తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త ముందే ఉంది.
Next Story