Wed Jan 08 2025 03:20:47 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తులం బంగారం ఎప్పుడు సామీ.. పెళ్లిళ్లు అయిపోతున్నాయ్
కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి ఎట్టకేలకు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, తులం బంగారం ఎప్పుడు అనన డౌట్ మొదలయింది
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఎట్టకేలకు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర్నాన్ని ఇచ్చిన పార్టీగా అధికారాన్ని తెచ్చుకోవడానికి పదేళ్ల సమయం పట్టింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముప్పయి రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ పై విపక్షాలు వత్తిడి తెస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? ఎందుకింత జాప్యం? హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. విపక్షాల విమర్శలకు తెలంగాణ మంత్రులు ధీటుగానే జవాబులు ఇస్తున్నప్పటికీ ప్రజల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది.
వంద రోజుల్లో...
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని రేవంత్ సర్కార్ చెబుతుంది. అయితే ఒక్కొక్క హామీని నెరవేర్చాలంటే ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో అది సాధ్యం కాని పని ఆర్థిక నిపుణులు చెబుతున్నప్పటికీ అమలు చేసి తీరుతామని మాత్రం తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. హామీల్లో ముఖ్యమైనది కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారాన్ని కూడా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం మహిళలు వెయిట్ చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఎప్పుడో ప్రారంభమయింది. మార్చి నెలతో ముహూర్తాలు ముగియనున్నాయి. దీంతో కల్యాణ లక్ష్మి పథకం తమకు వస్తుందా? రాదా? అన్న అనుమానం జనంలో బయలుదేరింది.
సీజన్ ముగుస్తుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటం, పెళ్లి తంతు పూర్తయిన తర్వాత డబ్బులు, తులం బంగారం వస్తుందో? రాదో? అన్న బెంగ ప్రజల్లో బయలుదేరింది. గత రెండు నెలల నుంచి లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తులం బంగారం అంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు బిగ్ రిలీఫ్ గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో తులం బంగారం అంటే దాదాపు అరవై వేలు పలుకుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం అందుకోసం నిబంధనలు రూపొందిస్తున్నామని కాలయాపన చేస్తుంది. తమకు మరో 70 రోజుల సమయం ఉందని చెబుతోంది. దీంతో ఈ రెండు నెలల తర్వాతైనా తులం బంగారం ఇంటికి చేరుతుందా? లేదా? అన్నదే బగ్ డౌట్.
Next Story