Sat Nov 16 2024 02:41:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ త్వరలోనే ప్రకటన
తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది, రుణమాఫీపై జూన్ 2న ప్రకటన చేయనుంది
తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే రుణమాఫీ పై ఒక ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన కసరత్తులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనిపై పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు ప్రకటించారు. రైతు రుణ మాఫీ ప్రకటన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే...
తాము ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ప్రతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఆచరణ రూపంలోకి తీసుకు రావడానికి అధికార యంత్రాంగం కసరత్తులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలుపర్చే దిశగా అధికార యంత్రాంగం అందుకు సర్వం సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది? ఎంత మొత్తం రుణాన్ని మాఫీ చేయాల్సి ఉంటుందన్న దానిపై ఇప్పటికే నివేదికలను సిద్ధం చేశారు. అయితే ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయినట్లు సమాచారం.
సర్వం సిద్ధం...
అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ లోపు రెండు లక్షల రుణాన్ని మాఫీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల మేరకు రుణాన్ని మాఫీ చేయడానికి సిద్ధమయ్యారు. రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువుంటే రైతులు మిగిలినది చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో తీసుకున్నా వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నా ఆ రుణం కూడా మాఫీ చేయనున్నారని తెలిసింది. అయితే దీర్ఘకాలిక రుణాలకు మాత్రం వర్తించదని అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీలోగా రుణాలను మాఫీ చేసేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు.
Next Story