Revanth Reddy : వరంగల్ సభలో నేడు మహిళలకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నారటగా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వచ్చే నెల ఏడోతేదీకి ఏడాది సమయం పూర్తి చేసుకుంటుంది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వచ్చే నెల ఏడోతేదీకి ఏడాది సమయం పూర్తి చేసుకుంటుంది. దీంతో పార్టీ, ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహిస్తుంది. పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత కూడా అధికారానికి ఆ పార్టీ పదేళ్ల పాటు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు అనేక హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. ముందుగా ఐదు గ్యారంటీలతో జనంలోకి వెళ్లడంతో ప్రజలు కూడా నమ్మి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు.
కొన్నింటిని మాత్రమే…
అయితే ఇప్పటి వరకూ ఎన్నికలకు ముందు ఇచ్చిన కొన్ని హామీలను మాత్రమే కాంగ్రెస్ అమలు చేసింది. రాష్ట్ర ఖజానా నిండుకోవడంతో పాటు, ఆదాయ వనరులు తగ్గడంతో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలను టీజీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఆర్టీసీ నుంచి కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు తామిచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది.
అనేక హామీలు…
ఇక మరోవైపు విద్యుత్తు బిల్లుల చెల్లింపులో రాయితీలను కూడా ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ హామీని కూడా అమలు చేసింది. దీంతో పాటు రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీని కూడా చాలా వరకూ అమలు చేసింది. కొంత వరకూ పెండింగ్ లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేశామని చెప్పుకునే వీలుకలిగింది. ఇంకా అనేక హామీలను అమలు చేయాల్సి ఉండటంతో విపక్షాల నుంచి కొంత విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తుంది.
వరంగల్ సభలో…
అయితే ఈరోజు వరంగల్ పట్టణంలో ఇందిరాశక్తి పేరుతో మహిళల సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో మరో గ్యారంటీ అమలు చేసే విధంగా రేవంత్ ప్రకటన ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయాన్ని ఇస్తామని హామీ ఇచ్చింది. రేషన్ కార్డులు ఇంకా మంజూరు చేయాల్సి ఉండటంతో ఈ పథకాన్ని ఇప్పటి వరకూ వాయిదా వేసుకుంటూ వస్తుంది. అయితే ఈరోజు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పథకం అమలుపై తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకోసమే తెలంగాణ మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు.