Mon Dec 23 2024 11:37:25 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నాన్చడం ఎందుకు.. నాలుగు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు? గడువు గంటలే కదా?
కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. నామినేషన్ కు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉంది
కాంగ్రెస్ నాలుగు సీట్ల విషయంలో నానుస్తూనే ఉంది. నామినేషన్ కు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకూ మూడు జాబితాలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ ను ప్రకటించాల్సి ఉంది. రేపటితో నామినేషన్ల గడువు పూర్తవుతున్నా కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం ఇంకా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిర్ణయించకపోవడంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే నామినేషన్లు వేసుకునే అవకాశముంటుందని, ఆలస్యం చేస్తే హడావిడిలో తప్పులు దొర్లితే దానికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.
నాలుగు చోట్ల...
సీపీఐకి కొత్తగూడెం స్థానాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇంకా తుంగతుర్తి, చార్మినార్, మిర్యాలగూడ, సూర్యాపేట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక్కడ ఈక్వేషన్లు సరిగా కుదరకపోవడంతో పాటు సీపీఎంతో బుజ్జగింపులు ఇంకా కొనసాగుతుండటం వంటి కారణాలతో నాలుగు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఈ స్థానాల్లో ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. తమ అభ్యర్థులకే సీటు ఇవ్వాలన్న అగ్రనేతల సిఫార్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
మల్లగుల్లాలు...
దీంతో నాలుగు సీట్లలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతుంది. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకున్న కాంగ్రెస్ నామినేషన్ల గడువు చివరి రోజు వరకూ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు లేదు. మరో వైపు పఠాన్ చెర్వు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులను మార్చాలన్న వత్తిడి కూడా వస్తుంది. కొందరికి ఇంకా బీ ఫారాలు కూడా ఇవ్వలేదు. దీంతో ప్రకటించిన చోట ఇద్దరు కాంగ్రెస్ నేతలు నామినేషన్ పత్రాలు వేశారు. ఇది క్యాడర్ లో కొంత అయోమయానికి దారి తీస్తుంది. అయితే పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలను ఈరోజు ప్రకటించే అవకాశముంది. ప్రకటన కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Next Story