వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్ : రేవంత్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పథకాలను సీఎం కేసీఆర్ కాపీకొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్, షాద్‌నగర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని తన ఎంపీ కార్యాలయంలో కంది శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు.
ఇక చేరికల కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్‌రెడ్డి. ఆయన్ను జోగు రామన్న అని పిలిచే బదులు జోకుడు రామన్న పిలిస్తే బాగుంటుందని తీవ్రంగా విమర్శించారు. జోగు రామన్న చెల్లని రూపాయని సీఎం కేసీఆరే నిర్ణయించారని.. అందుకే ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందన్నారు రేవంత్‌రెడ్డి. మరోసారి సీఎం కేసీఆర్‌ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని జోస్యం చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్న రేవంత్‌రెడ్డి.. జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయల సాయంతో పాటు ఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. అదే విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయాలకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలో మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామన్నారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. అధికారంలోకి రాగానే కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేస్తోందన్న ఆయన.. తెలంగానలోనూ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తున్న హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాగాంధీకి జన్మదిన కానుక ఇద్దామని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.