Sun Dec 22 2024 18:08:12 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : అధికారంలోకి రాగానే జనగణన చేస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా జనగణన చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా జనగణన చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆలంపూర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోని పేదలందరి జాబితాను తయారు చేసి వారిని ఆదుకుంటామని తెలిపారు. దేశంలో యాభై శాతానికి పైగా వెనుకబడిన ప్రజలు ఉన్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. వితంతువులకు పింఛను రెట్టింపు చేశామని చెప్పారు.
పదేళ్లలో కొన్ని కుటుంబాలకు
ఈ పదేళ్లలో ప్రధాని మోదీ కొన్ని కుటుంబాలకు మాత్రమే మేలు చేశారన్నారు. అదానీ, అంబానీ కుటుంబాలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఆయన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని చెప్పారు. రాజ్యంగ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ప్రతి పేదింటలో ఒక మహిళను గుర్తించి ఆమె పేరిట బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తామని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ముప్ఫయి వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ రిజర్వేషన్లను తొలగించాలని ప్రయత్నిస్తుందని అన్నారు.
ఆ ఇద్దరికే ప్రయోజనాలు....
ఎయిర్పోర్టులు, బ్యాంకులు, పోర్టులను అమ్మేసి మోదీ ప్రభుత్వం అద్వానీ, అంబానీలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లను కూడా తొలగించాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబాన్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పారు. యువత కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధరను కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రైతులను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.
Next Story