తెలంగాణలో యాక్షన్ ప్లాన్‌కు రెడీ అవుతున్న కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆయా పార్టీల వ్యూహాలు మార్చుకుంటున్నాయి. రాష్ట్రంలో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆయా పార్టీల వ్యూహాలు మార్చుకుంటున్నాయి. రాష్ట్రంలో దూకుడు వేగవంతం చేసింది. రాష్ట్రంలో పాలన పగ్గాలు చేతబట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైన సరే ఈ సారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేది అంటూ చెబుతోంది. ఇందు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణాలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సైతం కాంగ్రెస్‌కి సానుకూలంగా ఉండడంతో ఏఐసీసీ యాక్షన్ ప్లాన్‌కు రెడీ అవుతోంది.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రంగంలోకి దిగనున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడంతో పాటు గెలుపొందేందుకు కావాల్సిన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ఆరు గ్యారంటీల రూపంలో హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఆరు గ్యారంటీల హామీలను గడపగడపకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్.
తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో.. మరోసారి అగ్రనేతలు పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల వేళ రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో ముమ్మరంగా పర్యటించనున్నారు. దాదాపు మూడు రోజులపాటు రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ ఉండనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సభలు, ర్యాలీలు,గడపగడపకు వెళ్లి జనాలను కలుసుకోవడం ఇలా ఒక్కటేమిటి రకరకాల యాక్షన్ ప్లాన్లను రెడీ చేస్తోంది కాంగ్రెస్.