Thu Dec 19 2024 18:01:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మహిళలకు గుడ్ న్యూస్...తులం బంగారం అప్పుడే నట.. సిద్ధం అవుతున్న తెలంగాణ సర్కార్
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతుంది
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతుంది. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ వెళుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీనికి మంచి స్పందన లభించింది. ఇంకా లభిస్తూనే ఉంది. ఇక మహిళలు అత్యంత ఇష్టపడే.. కష్టపడే వంటింట్లో కష్టాలను కూడా గుర్తించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీని కూడా ప్రారంభించింది. దీంతో పాటు ఉచిత విద్యుత్ ను కూడా అమలు చేసి మహిళ ఓటర్లను పార్టీకి అంటుకుపోయేలా ప్రభుత్వం తొలి దశలోనే నిర్ణయాలను తీసుకుంది. ఇచ్చిన హామీలను అమలుపర్చింది.
అనేక హామీలు...
గత ఎన్నికల సమయంలో మహిళలను ఆకట్టుకునేలా అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందులో మరొకటి ఇందిరమ్మ కానుక కింద పెళ్లి కుమార్తెకు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్కీమ్ అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వరకూ అనేక రాజకీయ పార్టీలు వెటకారం చేశాయి. లక్ష రూపాయల నగదు వరకూ ఓకే.. తులం బంగారం ఏంటి అంటూ సెటైర్లు కూడా వినిపించాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అదేమీ చూసుకోకుండా తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని తెలిపింది.
నాటి ప్రభుత్వంలో...
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయల నగదు ఇచ్చే వారు. అలే షాదీ ముబారక్ పథకం కింద ముస్లిం యువతులు వివాహం చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చే వారు. తెల్ల కార్డు ఉన్న వారందరూ ఈ పథకం కింద అర్హులుగా నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కొన్నేళ్ల పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం బీఆర్ఎస్ పథకం అమలు చేస్తూ వచ్చింది. అయితే అప్పట్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే ఈ పథకం వర్తింప చేశారన్న విమర్శలు వినిపించేవి. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నేతలు కూడా సిఫార్సు చేయనిదే ఈ పథకం వర్తించేది కాదన్న ఆరోపణలు వినిపించాయి. నిరుపేదలయినా వారికి ఎమ్మెల్యేనో, కారు పార్టీ నేత సిఫార్సు చేయకపోతే లక్ష రూపాయలు అందేవి కావని, నియోజకవర్గానికి ఇన్ని అని కొంత లిమిట్ పెట్టేవారిని కాంగ్రెస్ గతంలో ఆరోపించేది.
రెండు నెలల్లో...
అయితే ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడానికి రేవంత్ సర్కార్ రెడీ అయినట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి నెలకు 2,500 రూపాయలు అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అయితే ఇదిరమ్మ కానుక కింద పెళ్లి చేసుకున్న పేదింటి యువతులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, తులం బంగారం ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిందట. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయించారట. అయితే ప్రస్తుతం మూఢమి నడుస్తుండటంతో ముహూర్తాలు లేవు. ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలున్నాయి. పెళ్లిళ్లు జరగనుండటంతో ఆ నెల నుంచే ఈ పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆగస్టులో రైతు రుణ మాఫీ ఉన్నప్పటికీ, మహిళలను ఆకట్టుకునేలా ఈ పథకాన్ని కూడా అదే నెల నుంచి వర్తింప చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సో.. మహిళలకు గుడ్ న్యూస్ కాక మరేంటి?
Next Story