Fri Dec 20 2024 16:59:44 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ దూకుడు
తెలంగాణలో ఎన్నికల కోసం కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సునిల్ కనుగోలు టీమ్ ఇతర స్వతంత్ర ఏజెన్సీల ద్వారా పార్టీ రాష్ట్రంలో పలు సర్వేలు చేయిస్తోంది. అది పూర్తయిన తర్వాత 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో119 నియోజకవర్గాలు ఉండగా.. అందులో 50 శాతం సీట్లకు అభ్యర్థులను జూన్లోనే ఖరారు చేస్తారని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఈ పేర్లను బహిరంగంగా ప్రకటించరని చెబుతున్నారు. ఆయా అభ్యర్థులకు ముందుగానే వెల్లడిస్తే.. నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈ 60 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్దగా తలనొప్పులు తీసుకుని రాని స్థానాలని అంటున్నారు.
జూన్ చివరి నాటికి లేదా జూలై మధ్య నాటికి, ఎన్నికల గురించి స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఆ సమయానికల్లా సమాయత్తమవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో పెద్దగా సమస్యలు, వర్గ విభేదాలు లేని 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారు. సీనియర్, పాపులర్ నాయకులే ఈ 60 మంది లిస్టులో ఉంటారని అంటున్నారు. ఇప్పటికే కీలకమైన నియోజకవర్గాల్లో సర్వేలు పూర్తయ్యాయి. జూన్లో మరోసారి ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసి.. అభ్యర్థులను నిర్ణయిస్తారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహం అమలు చేసింది. సీనియర్లను పూర్తిగా తప్పించకుండా వారికి అనుకూలమైన నియోజకవర్గంలో టికెట్లు కేటాయించింది. ముందుగానే ఎక్కడి నుంచి టికెట్ కేటాయిస్తున్నామో చెప్పడం ద్వారా ఆ తర్వాత ఎలాంటి గందరగోళం లేకుండా ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం అనంతరం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టనున్నది. రాబోయే రోజుల్లో రాహుల్, ప్రియాంక, మల్లిఖార్జున్ ఖర్గేల పర్యటనలు ఉండనున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా తరచూ తెలంగాణలో జరిగే సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని పార్టీ చెబుతున్నా ఆఖర్లో మార్పులు తప్పవని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో సర్వ శక్తులు ఒడ్డనుంది.
Next Story