Sun Dec 22 2024 17:16:10 GMT+0000 (Coordinated Universal Time)
హస్తం.. ఆరు హామీలు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి తీరాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఆరు గ్యారంటీలను ప్రకటించారు.
01. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500లు
02. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
03. రైతులకు ఏడాదికి పెట్టుబడి సాయం పదిహేనువేలు
04. కౌలు రైతులకు పన్నెండు వేలు
05. రూ.500లకే గ్యాస్ కనెక్షన్
06. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి తీరాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు పార్టీలు కాదని ఆయన అన్నారు. తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్తోనే కాదు బీజేపీ, మజ్లిస్ తోనూ పోరాటం చేస్తున్నామని తెలిపారు. సోనియా గాంధీ మాట ఇస్తే ఖచ్చితంగా దానిని నిలబెట్టుకుంటారని రాహుల్ అన్నారు. రాజకీయాల్లో ఎవరితో పోరాటం చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలని రాహుల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సోనియా అలాగే ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. 2006లో మాట ఇచ్చి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
కేసీఆర్ కుటుంబం మాత్రమే....
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఆ కుటుంబం కోసం తాము తెలంగాణ ఇవ్వలేదని రాహుల్ అన్నారు. రైతులు, బలహీనవర్గాలు, పేదలకోసం తెలంగాణకు ఇస్తే అది వారి కుటుంబానికి ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ప్రభుత్వం మారబోతుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇల్లులేని వారందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నట్లే ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు హామీలను కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అమలు చేస్తామని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
ప్రమాణస్వీకారం రోజునే...
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కీలక వాగ్దాలను చేసింది. ఆరు గ్యారింటీలను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి గ్యారంటీని సోనియా గాంధీ ప్రకటించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తతామని ప్రకటించారు. ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైతులకు ఏడాది పెట్టుబడి సాయం కింద పదిహేను వేల రూపాయలు ప్రకటిస్తున్నామని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. రూ.500లకే మహిళలకు గ్యాస్ సిలిండర్ అని, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. వరికి మద్దతుధరతో పాటు అదనంగా రూ.500లు బోనస్ గా ఇస్తామని తెలిపారు. వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. తుక్కుగూడలో జరిగిన సభకు పెద్దయెత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.
ఉచిత విద్యుత్తు...
ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని ఖర్గే చెప్పారు. అది పేదల ఆకలి తీర్చిందన్నారు. సెప్టంబరు 17 తెలంగాణకు చారిత్రాత్మకమైన దినమని చెప్పారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జనాభాలకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేస్తామని ఖర్గే తెలిపారు. తెలంగాణ ఇచ్చింది తామే, అభివృద్ధి చేసింది తామేనని సోనియా గాంధీ తెలిపారు. గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందచేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికీ 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని తెలిపారు. చేయూత పథకం ద్వారా నెలకు నాలుగువేల పింఛను అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం లిమిట్ ను పది లక్షల వరకూ పెంచుతామని హామీ ఇచ్చారు.
Next Story