Tue Nov 05 2024 16:27:05 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ లో కొత్త భయం
గత రెండు ఎన్నికల్లా కాకుండా ఈసారి తెలంగాణలో త్రిముఖ పోరు తప్పనిసరిగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా బలంగా మారుతోంది.
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..! ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని చాలా మంది వరకూ అనుకోగా.. ఊహించని విధంగా కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసుకుంది. బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఊపులో మిగిలిన రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. ఆ లిస్టులో మొదట తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయాలను సాధించింది. ఇక మూడో సారి కూడా విజయాన్ని సొంతం చేసుకోడానికి వ్యూహాలను రచిస్తోంది. అయితే ఓటర్లు ఎటువంటి తీర్పును ఇస్తారోనని బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఓటర్ నాడిని తెలుసుకోడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
గత రెండు ఎన్నికల్లా కాకుండా ఈసారి తెలంగాణలో త్రిముఖ పోరు తప్పనిసరిగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా బలంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామాల్లో క్యాడర్ ను కూడా సమాయత్తం చేస్తూ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గత ఎన్నికలతో పోలిస్తే మంచి ఫలితాలు వస్తే మాత్రం బీఆర్ఎస్ కు అధికారం దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గులాబీ బాస్ ప్రస్తుతానికైతే పొత్తులు లేకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు. ఫలితాలు వచ్చాక పొత్తుల వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గుర్తించినా.. అదేమీ బయటపెట్టడం లేదు. కొత్త కొత్త పథకాలను ప్రజల ముందుకు తీసుకుని వద్దాం అనే దిశలోనే ఆలోచిస్తూ ఉంది.
ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కోసం బీఆర్ఎస్ అధిష్టానం కీలక సూచనలు చేస్తోంది. గతంలో ఎమ్మెల్యేలకు తరచూ కలిసే అవకాశం కూడా కల్పించని అధినేత కేసీఆర్.. ఇప్పుడు పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా కర్ణాటక ఫలితం ఎఫెక్ట్ అని అంటూ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల్లో ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతకు తగ్గించేందుకు ఇప్పటికే పలువురు నాయకులు రంగంలోకి దిగారు. ఎన్నికలకు కేవలం కొన్ని నెలలే ఉండడంతో పలు కీలక ప్రకటనలు చేస్తూ వస్తోంది అధికార బీఆర్ఎస్. సమస్యలకు పరిష్కారాలు చూపే పనిలో పడింది. చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వంపై కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ పడిందని స్పష్టంగా అర్థం అవుతోంది.
Next Story