Mon Dec 23 2024 10:26:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గుర్తులు చెరిపేసే ప్రయత్నమా..? కేసీఆర్ అనే మాట ఇక విననపడకూడదనేనా? అయితే మీరేం చేశారు సామీ?
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏపీకి చెందిన కీరవాణికి స్వర రచన చేయడం అప్పగించడం పై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్దయెత్తున వాదన జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యగా కారు పార్టీ నేతలు దీనిని అభవర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్లు.. ఏపీకి చెందిన వ్యక్తికి ఎలా అప్పగిస్తారంటూ నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర గీతం రచించిన అందెశ్రీ ఆలోచన మాత్రమేనని, అది తనది కాదని చెప్పుకొచ్చారు.
ఇక రాష్ట్ర గీతంపై ఇంకా వివాదం నడుస్తుండగానే రాష్ట్ర చిహ్నంపై కూడా దుమారం చెలరేగింది. సోషల్ మీడియాలో రాష్ట్ర చిహ్నం ఇదేనంటూ ఒకటి చక్కర్లు కొడుతుంది. అందులో రైతులకు సంబంధించిన వరి కంకులతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఉంచారు. దీనిపై బీఆర్ఎస్ పెద్దయెత్తున ఆందోళనకు దిగింది. తెలంగాణ చిహ్నంపై ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ వాళ్లు నిలదీస్తున్నారు. చార్మినార్ వద్ద జరిగిన ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటూ ఇన్నాళ్లూ బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. అయితే ఆ గుర్తులను చెరిపేసి అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అదీ కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిందని గుర్తు చేయడానికే ప్రభుత్వం ఈ పనిచేస్తుందని బీఆర్ఎస్ నేతలు నేరుగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొంత వెనకడుగు వేసినా...
అయితే తెలంగాణ గీతాన్ని ఆమోదించిన ప్రభుత్వం చిహ్నం విషయంలో మాత్రం కొంత వెనకడుగు వేసింది. అందరి ఆలోచనలను, అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే తెలంగాణ చిహ్నాన్ని ఆమోదించాలని నిర్ణయించింది. హడావిడిగా తెలంగాణ చిహ్నాన్ని ఖరారు చేసే కంటే అందరి సూచనలను తీసుకున్న తర్వాత, అదీ అమరవీరులు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఆమోదించాలన్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారని తెలిసింది. ప్రస్తుతానికి తెలంగాణ చిహ్నం మాత్రం జూన్ 2వ తేదీన ఆవిష్కరణ ఉండదు. కేవలం రాజకీయ పార్టీలు ఆమోదించిన రాష్టర్ గీతాన్ని మాత్రమే ఆరోజు ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ గీతాన్ని ఆవిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు. అయితే కాంగ్రెస్ కూడా చిహ్నం విషయంలో బీఆర్ఎస్ విమర్శలకు ఏమాత్రం తగ్గడం లేదు. ధీటుగానే సమాధానం చెబుతుంది.
మీ హయాంలో...?
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత, బతుకమ్మ పాటలను ఏఆర్ రెహమాన్ తో ఎలా పాడించారని ప్రశ్నిస్తున్నారు. ఆయన తెలంగాణకు చెందిన వాడా? అని నిలదీస్తున్నారు. ఇక చినజీయర్ స్వామి ట్రస్ట్ కు పన్నెండు కోట్ల విలువైన భూమిని పదహారు లక్షలకు మాత్రమే కట్టబెట్టిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆయన ఆంధ్ర వ్యక్తి కాదా? అని ప్రశ్నిస్తున్నార. లక్షల కోట్ల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించిన మేఘా కృష్ణారెడ్డిది ఎక్కడ అని నిలదీస్తున్నారు. యాదాద్రి డిజైన్ ను రూపొందించిన ఆనంద్ సాయి ఆంధ్రోడు కాదా? అని అంటున్నారు. విశాఖ శారదాపీఠానికి రెండు కోట్ల విలువైన భూమిని రూపాయికే కట్టబెట్టిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇంతమంది ఆంధ్రోళ్లకు మేలు చేసిన మీరు ఇప్పుడు రాష్ట్ర గీతాన్ని కీరవాణికి ఇవ్వడాన్ని ఎలా తప్పుపడతారంటూ కాంగ్రెస్ సూటిగానే ప్రశ్నిస్తుంది. మొత్తం మీద దశాబ్ది వేడుకల సందర్భంగా అసలు విషయం పక్కకు పోయి.. అనవరమైన వివాదాన్ని తీసుకు వచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
Next Story