Mon Dec 23 2024 12:25:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాంక్ నిర్లక్ష్యం.. 18 గంటలుగా గదిలోనే వృద్ధుడు
లాకర్ గదిలోకి వెళ్లిన వ్యక్తిని గమనించకుండా సిబ్బంది బ్యాంక్ ను మూసివేయడంతో.. ఆ వృద్ధుడు 18 గంటల పాటు లాకర్ గదిలోనే ..
హైదరాబాద్ : ఓ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వృద్ధుడి ప్రాణాలమీదికి తీసుకొచ్చింది. లాకర్ కోసం బ్యాంక్ కు వచ్చిన కస్టమర్ ను గమనించకుండా బ్యాంక్ ను లాక్ చేశారు సిబ్బంది. రాత్రంతా ఆ వృద్ధుడు లాకర్ రూమ్ లోనే ఉండిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లిహిల్స్ యూనియన్ బ్యాంక్ లో సోమవారం జరిగిందీ ఘటన. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 67లో కృష్ణారెడ్డి నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని యూనియన్ బ్యాంకు కు వెళ్లి.. తనకు లాకర్ రూమ్ లో పని ఉందని చెప్పి వెళ్లారు.
లాకర్ గదిలోకి వెళ్లిన వ్యక్తిని గమనించకుండా సిబ్బంది బ్యాంక్ ను మూసివేయడంతో.. ఆ వృద్ధుడు 18 గంటల పాటు లాకర్ గదిలోనే గడపాల్సి వచ్చింది. రాత్రంతా కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్లాడా అని ఆరా తీసిన పోలీసులు.. మంగళవారం ఉదయం సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. కృష్ణారెడ్డి బ్యాంక్ లాకర్ గదిలోనే ఉన్నట్లు గుర్తించి..వెంటనే గదిని తెరిచి కృష్ణారెడ్డిని బయటికి తీసుకొచ్చారు. అతను అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Next Story