Tue Nov 05 2024 14:56:45 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు బేరసారాలు
టీఆర్ఎస్ కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేస్తున్న సమయంలో..
సైబరాబాద్ పీఎస్ పరిధిలో ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ పై పోలీసులు రైడ్ చేశారు. టీఆర్ఎస్ కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ఎమ్మెల్యేలతో స్వామీజీ బేరసారాలు బెడిసి కొట్టాయి. ఢిల్లీలోని కొందరి పెద్దలతో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. అయితే ఇక్కడ ఎలాంటి డబ్బులు లభ్యమయినట్లు పోలీసు అధికారులు వెల్లడించలేదు.
హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, తిరుపతి నుంచి స్వామీజీ సింహయాజులు టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి లకు డబ్బు, పదవులు, కాంట్రాక్టుల రూపంలో ప్రలోభాలు చూపించి పార్టీ ఫిరాయించాల్సిందిగా అడిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఆశ చూపినట్లు సమాచారం.
ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్ ఫాంహౌస్ పై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రామచంద్రభారతిని డెక్కన్ డ్రైవ్ హోటల్ కు చెందిన నందు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరాకరించారు. ఫాంహౌస్ ఓనరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నందు, రామచంద్రభారతిలను పోలీసులు ఫాంహౌస్ లోనే విచారిస్తున్నారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు పంపేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేలు నలుగురు తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆయనతో జరిగిన విషయాలను చెప్పారు.
Next Story