Fri Feb 21 2025 11:11:23 GMT+0000 (Coordinated Universal Time)
Komatireddy : కోమిటిరెడ్డి కుదురుగా ఉండరా? పార్టీ కూడా లైట్ తీసుకుంటుందా?
కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ. అందులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలకు మరింత స్వేచ్ఛ ఎక్కువ

కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ. అందులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలకు మరింత స్వేచ్ఛ ఎక్కువ. కోమటిరెడ్డి నిత్యం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. వివాదాల అంచునే ఆయన నడుస్తుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు అందరికీ తెలిసిందే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికీ ఆశ్చర్యం కలగక మానదు. అలాగే ఆయన చేసే వ్యాఖ్యలు కూడా పెద్దగా సంచలనం అనిపించదు. ఒకరకంగా ఆయన కామెంట్స్ ను పట్టించుకోవడం క్యాడరే మానేసింది. ఎందుకంటే..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదో ఆశించి చేసే వ్యాఖ్యలుగానే అందరూ చూస్తారు. అందుకే ఆయన తీసుకునే నిర్ణయాలు,చేసే వ్యాఖ్యలపై కార్యకర్తల నుంచి నేతలు సహా ఎవరూ సీరియస్ గా తీసుకోరు.
ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి చేసిన కామెంట్స్ నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అయినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆయనింతేలే అన్నట్లు పార్టీ నేతలు కూడా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు న్యాయం చేయలేకపోతున్నామని తెలిపారు. సక్రమంగా పథకాలు అమలు చేయలేకపోతున్నామని, లబ్దిదారులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనడం అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలను విస్తుబోయేలా చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వమే బాగుందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కితాబివ్వడం కూడా చర్చనీయాంశమైంది. గ్రామ సభల్లో జనం తిరగబడుతున్నారని, అధికారులను నిలదీస్తున్నారని, ప్రభుత్వాన్ని తిడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు.
మంత్రి వర్గ విస్తరణలో...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కో్సమే ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే త్వరలో తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో్ తనకు కేబినెట్ లో చోటు కావాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన తొలుత కాంగ్రెస్ లో ఉండి రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పుడు వ్యతిరేకించి బయటకు వచ్చారు. మునుగోడు ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేశారు. తర్వాత ఆయన బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్లో కాంట్రాక్టుల కోసమే ఆయన బీజేపీలో చేరినట్లు పెద్దగా ప్రచారం జరిగినా, ఆయన మాత్రం కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వ్యతిరేకించి రాజీనామా చేశారు.
మైనస్ లు ఎక్కువగా...
అందువల్ల ఆయనను కేబినెట్ లో తీసుకునే విషయంలో ఇటు రేవంత్ కాని, అటు హైకమాండ్ కానీ సుముఖంగా ఉండే అవకాశం లేదు. దీంతో పాటు ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా మూడో వ్యక్తికి, అదే జిల్లాకుచెందిన ఒకే కుటుంబానికి రెండు పదవులు ఇస్తారా? అన్న అనుమానం కూడా లేకపోతేదు. కేబినెట్ విస్తరణలో మరో ఆరుగురికి అవకాశం ఉంటుంది. అందులో సామాజికవర్గం పరంగా చూసుకున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మైనస్ గా మారనుంది. అదే సమయంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో అక్కడి నుంచి ఇద్దరికి చోటు కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాదన్న ఫ్రస్టేషన్ లోనే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారంటూ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Next Story