Thu Apr 17 2025 19:06:07 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ కు డీజీపీ కౌంటర్
తనను బలవంతంగా ప్రభుత్వం సెలవుపై పంపిచిందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు

తనను బలవంతంగా ప్రభుత్వం సెలవుపై పంపిచిందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన ఆరోపణలు ఏమాత్రం నిజం కావన్నారు. తాను ఇంట్లో జారిపడిన ఘటనలో ఎడమ భుజానికి గాయమయిందని, దీంతో పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన మేరకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకూ సెలవులో ఉండాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజూ వ్యాయామం, ఫిజియోథెరిపీ చేస్తున్నానని చెప్పారు.
అసత్య ప్రచారం...
వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందని చెప్పడం బాద్యతారాహిత్యమైన ఆరోపణలేనని మహేందర్ రెడ్డి అన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధికారులపై అసత్య ప్రచారం చేయడం తగదని రేవంత్ రెడ్డికి డీజీపీ సూచించారు. ఉన్నతస్థాయిలో బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఇటువంటి ఆరోపణలు పోలీసు శాఖ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసే ముందు విచక్షణను ఉపయోగించి, సంయమనం పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.
Next Story