Mon Dec 23 2024 10:59:37 GMT+0000 (Coordinated Universal Time)
ప్రీతి కేసుపై స్పందించిన ఆర్జీవీ.. ప్రభుత్వానికి సంబంధం లేదా ?
తమ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని, అతనికి ఎవరెవరు సహకరించారో వారందరినీ శిక్షించాలని కోరారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన మెడికో ప్రీతి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 26న కన్నుమూసింది. నిన్న ఆమె స్వగ్రామమైన గిర్నితండాలో.. బరువెక్కిన హృదయాలతో ప్రీతి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. తనకు తానుగా ఇంజెక్షన్ చేసుకోవడానికి ఆమె చేతిలో నరాలు అంతత్వరగా కనిపించవని ప్రీతి అక్క ఆరోపించింది. తన చెల్లెల్ని కావాలనే చంపేశారని, తమకు న్యాయం చేయాలని కోరింది.
ప్రీతి తండ్రి ధారావత్ నరేందర్ కూడా ఇదే విషయం చెప్పారు. తన బిడ్డ మృతిపై అనుమానాలున్నాయని వాపోయారు. తమ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని, అతనికి ఎవరెవరు సహకరించారో వారందరినీ శిక్షించాలని కోరారు. సైఫ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కాగా.. ప్రీతి ఏ మెడిసిన్ తీసుకుందని తెలుసుకునేందుకు ఆమె రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు వైద్యులు.
తాజాగా ప్రీతి కేసుపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ప్రీతి కుటుంబ ఆవేదనను ప్రభుత్వం రూ.30 లక్షలకు వెలకట్టిందని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ప్రీతి కేసు విషయంలో.. ఇద్దరు పెద్దల వేధింపుల సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఒకరు ఆమె ప్రాణాలను తీసుకెళ్తే.. న్యాయం చేయాల్సిన ప్రభుత్వం తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందన్నారు. ఎందుకంటే ఇది వేధింపుల/ఆత్మహత్యకు పాల్పడిన కేసు. కాబట్టి పోలీసులే పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలీసులైనా నిందితులను పూర్తిస్థాయిలో విచారణ చేసి, ఆమె మరణానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్జీవీ ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story