Sat Nov 23 2024 03:22:11 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు.. త్వరలోనే..!
గతంలో భారీగా నష్టాల పాలైన ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టడానికి సీనియర్ ఐపిఎస్ అధికారి వి.సి.సజ్జనార్ దాని మేనేజింగ్..
హైదరాబాద్ : ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు చేసిన సందడి అంతా.. ఇంతా.. కాదు..! కానీ కొన్ని అనుకోని కారణాల వలన డబుల్ డెక్కర్ బస్సులు మాయమయ్యాయి. అయితే తిరిగి హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నగరంలోకి 'డబుల్ డెక్కర్' బస్సు సర్వీసులను తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కొత్తగా 1,016 బస్సులను తీసుకుని రానున్నారు. వాటిలో చాలా వరకూ ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి. రాబోయే బస్సులకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయి.
గతంలో భారీగా నష్టాల పాలైన ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టడానికి సీనియర్ ఐపిఎస్ అధికారి వి.సి.సజ్జనార్ దాని మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో కొత్త ఆదాయాన్ని సృష్టించే వ్యూహాలతో కార్పొరేషన్ ముందుకు వెళ్లనుంది. సజ్జనార్ సంస్థ కోసం భవిష్యత్తు ప్రణాళికలను, దాని నష్టాలను ఎలా తగ్గించాలనుకుంటున్నారో వివరించారు. బాధ్యతలు స్వీకరించే సమయంలోనే జయించాల్సిన సవాళ్లపైనా, సంస్థను తిరిగి ట్రాక్‌లో ఉంచడానికి పలు ప్రణాళికలను అమలు చేస్తూ వస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ముఖ్యంగా అధికంగా ఉన్న ఇంధన ధరలు తమను చాలా టెన్షన్ పెట్టాయని ఆయన అన్నారు. టీఎస్ఆర్టీసీ రోజువారీ డీజిల్ వినియోగం దాదాపు ఆరు లక్షల లీటర్లు కాగా.. అదనంగా ఖర్చులను నియంత్రించాలని భావించామన్నారు. పలు సేవలను తీసుకుని రావడమే కాకుండా.. ఫ్రీక్వెన్సీ ద్వారా ఆదాయాలను పొందే మార్గాలను పెంచామని తెలిపారు. ఇందుకోసం చాలా శాస్త్రీయ అధ్యయనం జరిగిందని ఆయన అన్నారు.
కొత్తగా తీసుకుని వస్తున్న బస్సుల్లో ఎలెక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయని, ప్రణాళిక ప్రకారం పనులు జరిగితే, నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపై తిరిగే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి హైదరాబాద్ నగరానికి పరిచయం చేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. ప్రీమియర్ బస్సు నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నాము. ఒక్కో డబుల్ డెక్కర్ బస్సుకు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారని అన్నారు. TSRTC ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్-19 ప్రభావం ఆర్టీసీ కష్టాలను మరింత పెంచింది. సంక్షోభాన్ని అధిగమించడానికి సజ్జనార్.. కోవిడ్ -19 సహాయంగా మాకు రూ. 2,000 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాము. తాము అడిగిన మొత్తం విడుదల చేయబడితే, చాలా ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయని ఖచ్చితంగా అనుకుంటున్నామన్నారు.
Next Story