Sun Jan 05 2025 15:15:08 GMT+0000 (Coordinated Universal Time)
హరీశన్నా.. దీనికి జవాబేంది?
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఈడ్చుకుంటూ వెళ్లిన సంఘట ఇప్పుడు కలకలం రేపుతుంది. సోషల్ మీడియాలో వైరలయింది
ఒక సంఘటన జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో హోరెత్తిపోతాయి. అందునా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేసిన కామెంట్స్‌తో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధమే నడిచింది. అభివృద్ధి తెలంగాణలో చూడాలని, ఏపీలో రోడ్లు బాగాలేవని చేసిన హరీశ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా వైసీపీ సోషల్ మీడియా ఏపీలోని ఆసుపత్రులు, పాఠశాలలను బేరీజు వేస్తూ ఫొటోలు చూపుతూ విమర్శలు చేస్తుంది. దీనికి ధీటుగా టీఆర్ఎస్ సోషల్ మీడియా సయితం కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఘటన మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
రోగిని ఈడ్చుకుంటూ...
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగిని ఈడ్చుకుంటూ వెళ్లిన సంఘట ఇప్పుడు కలకలం రేపుతుంది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడం, వార్డు బాయ్స్ కూడా స్పందించకపోవడంతో బంధువులే కాళ్లుపట్టుకుని ఈడ్చుకుని వెళ్లడం కన్పించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హరీశ్ ను ఇదేనా అభివృద్ధి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 31వ తేదీన ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో...
రెండో అంతస్థులో వైద్యుడి వద్దకు వెళ్లాలంటే లిఫ్ట్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. కానీ స్ట్రెచర్ లేకపోవడంతో బంధువులు రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లడం అమానుషమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం వీల్ ఛెయిర్ ను కూడా ఇవ్వలేకపోయిన అధికారులను సస్పెండ్ చేయాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తమవుతుంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావుకు ఈ ఘటన తలనొప్పి తెచ్చిపెట్టిందనే చెప్పాలి. కానీ రెండు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని వీటిని వివాదం చేయడం తగదని అనేవారు కూడా లేకపోలేదు.
Next Story