Thu Dec 26 2024 23:39:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఓటుకు మూడు నుంచి ఐదు లక్షలట.. మన తెలంగాణలోనే.. ఎక్కడో తెలుసా?
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను గోవాకు తరలించారు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను గోవాకు తరలించారు. అక్కడ రిసార్ట్లో వారికి వసతితో పాటు సకల సౌకర్యాలు కల్పించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గోవాకు వెళ్లారు. క్యాంప్ ల వద్ద ప్రతిరోజూ ప్రత్యేకంగా విందులు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వారు అడిగింది అడిగినట్లు తెచ్చి ఇచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేయడం విశేషం. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఓటుకు మూడు నుంచి ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా గోవాకు తీసుకెళ్లారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కసిరెడ్డి నారాయణరెడ్డి గతంలో గెలిచారు. అయితే ఆయన మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో గోవాకు ఓటర్లను తరలించారు. బీఆర్ఎస్ ఓటర్లను బుజ్జగించేందుకు స్వయంగా కేటీఆర్ గోవా వెళ్లడం విశేషం.
ఓటర్లను తరలించి...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1,438 ఓటర్లున్నారు. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే తమ గ్రూపునకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ లను గోవాకు తీసుకెళ్లారు. ముఖ్యనేతలు కూడా వారితో పాటు గోవాకు వెళ్లి పార్టీకి అండగా నిలబడితే భవిష్యత్ ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ ఎన్నిక మార్చి 28వ తేదీన జరగనుంది. విజేతను ఏప్రిల్ 2వ తేదీన ప్రకటించనున్నారు. దీంతోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యలతో కలసి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు.
Next Story