Fri Apr 11 2025 13:41:55 GMT+0000 (Coordinated Universal Time)
SLBC : అసలు బతికే ఉన్నారా? లేదా? టన్నెల్ లోనే ఎనిమిది మంది
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఇంకా బయటకు రాలేదు.

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఇంకా బయటకు రాలేదు. వారకిని బయటకు తీసుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎంత ప్రయత్నించినా గత నాలుగు రోజుల నుంచి వారి కోసం టన్నెల్ లో వెదుకుతూనే ఉన్నారు. ఎన్.డి. ఆర్.ఎఫ్, నేవీ, ర్యాట్ మైనర్స్, భారత సైన్యం, సింగరేణి రెస్క్యూ టీం అన్ని రకాలుగా ఎనిమిది మంది కోసం ప్రయత్నిస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. అసలు ఎనిమిది మంది జీవించి ఉన్నారా? లేదా? అన్న సందేహం కూడా ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందికి కలుగుతుంది. గత నాలుగు రోజుల నుంచి టన్నెల్ లో ఉండిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదని నిపుణులు చెబుతన్నారు.
ఎన్ని ప్రయోగాలు చేసినా...
ఎన్ని ప్రయోగాలు చేసినా టన్నెల్ లోకి వెళ్లేందుకు కొంత మేరకే అవకాశం కలుగుతుంది. నాలుగు మీటర్లు వెళ్లడం చాలా దుర్లభంగా మారింది. శనివారం ఉదయం ప్రమాదం జరిగితే ఇప్పటి వరకూ వారి జాడ కనుగొనలేకపోవడంతో సహాయక చర్యలు చేపట్టిన వారిలో కూడా నిరాశ ఎదురవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారి కోసం వెదుకులాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. బురద, నీళ్లు పేరుకుపోయి ఉండటంతో లోపలికి వెళ్లడం సహాయక బృందాలకు సాధ్యం కావడం లేదు. అప్పటికీ వారికి ఆక్సిజన్ ను లోపలికి పంప్ చేస్తూ కొంత వరకూ బతికించడానికి సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి మంత్రుల వరకూప అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
బాధితుల బంధువులు...
టన్నెల్ లో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది జార్ఖండ్ వాసులున్నారు. వారి కోసం బంధువులు అక్కడికి వచ్చి నిరీక్షిస్తున్నారు. బతికి బయటకు వస్తే చాలు అని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ర్యాట్ మైనర్స్ కొంత వరకూ నిన్న వెళ్లడంతో వారి వల్ల కొంత ఆచూకీ లభ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈరోజు టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల జాడ తెలిసే అవకాశముందని అధికారులు చెబుతున్నా దానికి సంబంధించి ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. బతికి ఉంటే వారిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. కనీసం అలికిడి కూడా లేకపోవడంతో సహాయక చర్యలు చేపట్టిన వారిలో కూడా ఒకింత టెన్షన్ మొదలయిందనే చెప్పాలి. మొత్తం మీద ఆపరేషన్ టన్నెల్ ఇంతవరకూ పూర్తి కాకపోవడంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Next Story