Tue Apr 08 2025 14:02:50 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : భయం ప్రాణాలతో ఉంచుతుందా? ఛాన్స్ లేనట్లేనా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఇంత వరకూ ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభించలేదు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఇంత వరకూ ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. ఇప్పటికే వారం రోజులవుతున్నా జాడ కనిపించడకపోవడంతో వారు ప్రాణాలతో ఉంటారా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. ఎస్.ఎల్.బి.సి ప్రమాదంలో జరిగిన కార్మికులను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఏ మాత్రం ఫలితం కనిపించడం లేదు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగితే ఇప్పటి వరకూ జాడ లభించకపోవడంతో వారు జీవించి ఉండటంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. లోపలకి ఆక్సిజన్ పంపుతున్నప్పటికీ, ఆహారం, నీరు లేకపోవడంతో పాటు చిక్కుకుపోయిన కార్మికులు భయంతో బతికి ఉంటారా? అన్న భావన కలుగుతుందని అధికారులే అభిప్రాయపడుతున్నారు.
వేగవంతమయినా...
అయితే నిన్నటి నుంచి సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక బృందాలు 13.9 మీటర్ల వరకూ వెళ్లారు. మరో అడుగు వేస్తే చాలు కార్మికుల జాడ తెలిసే అవకాశముంటుందని భావిస్తున్నారు. అయితే బురద టన్నెల్ లో పేరుకుపోవడంతో పాటు నీరు పైకి ఉబికి వస్తుండటంతో గత ఐదు రోజుల నుంచి నీటిని తోడే కార్యక్రమాన్ని వేగంగా చేపట్టారు. ప్రస్తుతం నీటిని, బురదను తొలగించినా టీబీఎం మిషన్ ను తొలగించడమే పెద్దపని అని చెబుతున్నారు. గ్యాస్ కట్టర్ లతో టీబీఎం మిషన్ ను కట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక బృందాలు విడతలు వారీగా వెళుతూ నిర్వరామంగా పనిచేస్తున్నాయి. టన్నెల్ లోని పన్నెండో కిలోమీటర్ నుంచి బురద పేరుకుపోయింది.
ఆపరేషన్ కొలిక్కి వచ్చే...
అయితే ఈరోజు, రేపట్లో ఆపరేషన్ కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ వంటి వాటితో పాటు ఎల్.అండ్ టి సంస్థల కార్మికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రైల్వే శాఖ కూడా ప్రత్యేక బృందాన్ని పంపింది. పడిపోయిన టీబీఎం మిషన్ ను కట్ చేయడం, వాటిని తొలిగించి బయటకు తీసుకు రావడం కష్టంగా మారింది. చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల్లో ఎక్కువ మంది బీహార్ కు చెందిన వారు ఉండటంతో వారి బంధువులు పడిగాపులు కాస్తున్నారు. తమ వారి జాడ ఈరోజు అయినా తెలుస్తుందేమోనని ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. ఈరోజైనా కార్మికుల జాడ తెలుస్తుందని అందరూ గట్టిగా ఆశించాలి.
Next Story