Sun Mar 16 2025 12:33:25 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : పదకొండో రోజుకు చేరినా ఆచూకీ దొరకని కార్మికులు
శ్రీశైలం ఎడమ కాల్వలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల జాడ ఇంత వరకూ దొరకలేదు.

శ్రీశైలం ఎడమ కాల్వలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల జాడ ఇంత వరకూ దొరకలేదు. పదకొండు రోజలవుతున్నా నేటికీ వారు బతికి ఉన్నారా? లేదా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది. సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నా టన్నెల్ లో ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని సహాయక బృందాలు తెలిపాయి. ఏ క్షణంలోనైనా లోపల పై కప్పు కూలి పోయే ప్రమాదముందని, తాము రిస్క్ లో పడే అవకాశముందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా నీటిని తోడుతూ మట్టిని తొలగిస్తూ కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు.
ఉబికి వస్తున్న నీరు...
అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ ను మాత్రం పూర్తిగా కట్ చేసి అవశేషాలను బయటకు తీసుకు రావడంతో కొంత ఇబ్బందులు తొలిగినట్లేనని చెబుతున్నారు. అయితే కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు పూర్తయితే తప్ప కార్మికుల జాడ కనుగొనలేమని చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో నేడు ఏర్పాటయితే కార్మికుల జాడ లభించే అవకాశముందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. బురద తొలగించినప్పటికీ ఐదువేల లీటర్ల నీరు వరకూ ఉబికి వస్తుండటంతో సహాయక బృందాలు కార్మికులు ఉన్న చోటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజుల నుంచి సహాయక చర్యలను వేగవంతం చేసినా ఫలితం కనిపించడం లేదు.
కార్మికుల ఆచూకీ...
జీపీఆర్ సర్వే గుర్తించిన సర్వేలో తవ్వకాలు జరిపినా అక్కడ కార్మికుల ఆచూకీ లభించలేదు. కేవలం ఇనప పరికరాలున్నట్లు సహాయక బృందాలు తెలిపాయి.
దాదాపు పదకొండు టీంలు అహర్నిశలూ శ్రమిస్తున్నాయి. ఎన్ని బృందాలు లోపలికి వెళ్లి వస్తున్నా కార్మికుల ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. డీ వాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ గత మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా దాదాపు పదకొండు రోజుల నుంచి కార్మికులు టన్నెల్ లో చిక్కుకుని పోవడంతో వారు జీవించి ఉంటారన్న ఆశలు అడుగింటినట్లేనని అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో టన్నెల్ బయట అంబులెన్స్ లు, ఫోరెన్సిక్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఈరోజైనా సహాయక చర్యలు కొలికి వస్తాయో? లేదో చూడాలి.
Next Story