Fri Apr 04 2025 02:38:00 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఎమ్మెల్సీ స్థానాలకు పెరుగుతున్న పోటీ.. ముగ్గురు పేర్లు దాదాపు ఖరారు
తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి

తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో నాలుగు స్థానాలు చేరే అవకాశముంది. ఒక స్థానం బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలున్నాయి. మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఆరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సులువుగా, గ్యారంటీగా, పైసా ఖర్చు లేకుండా పెద్దల సభలో అడుగుపెట్టడానికి అనేక మంది ఆశావహులు క్యూ కట్టారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలు పెట్టారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్ ను కోరేందుకు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు.
టిక్కెట్లు త్యాగం చేసిన...
గత ఎన్నికల్లో కొందరు టిక్కెట్లను త్యాగం చేశారు. అలాంటి వారిలో అద్దంకి దయాకర్ ఒకరు. పార్టీకి లాయల్ గా పనిచేస్తూ కాంగ్రెస్ కు బలమైన గొంతుకగా పనిచేస్తున్నారు. గత ఎన్నికలలో తనకు టిక్కట్ దక్కకపోయినా పార్టీ విజయం కోసం పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన అద్దంకి దయాకర్ కు ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న ప్రచారం జరగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్ పేరును స్వయంగా రేవంత్ రెడ్డి సిఫార్సు చేసే అవకాశముంది. దళిత సామాజికవర్గం నేత కావడంతో అద్దంకి దయాకర్ కు ఈ దఫా ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశముందన్న ప్రచారం ఊపందుకుంది.
వీహెచ్ పేరు పరిశీలనలో...
కాంగ్రెస్ లో సీనియర్ నేత వి.హనుమంతరావు పేరు కూడా బలంగా ప్రచారంలో ఉంది. సీనియర్ నేత కావడంతో పాటు గాంధీ కుటుంబానికి వీరభక్తుడిగా ఉన్న వీహెచ్ కు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చిందంటున్నారు. వీహెచ్ రాజ్యసభ పదవికి వెళ్లాలని ఉంది. అయితే శాసనమండలికి ఎంపిక చేసి కేబినెట్ ర్యాంకు పదవి అయిన మండలి ఛైర్మన్ పదవి ఇస్తామన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దీంతో పాటు బీసీ సామాజికవర్గం నేత కావడంతో వీహెచ్ కు ఎమ్మెల్సీ స్థానం దక్కడానికి అదనపు బలం అని చెబుతున్నారు. వి.హనుమంతరావు ఎప్పుడూ సొంత పార్టీపైనే చిందులు తొక్కేవారు. అలాంటిది ఆయన కొన్నాళ్ల నుంచి సైలెంట్ గా ఉండటానికి కూడా ఇదే కారణమని చెబుతన్నారు.
జీవన్ రెడ్డి పేరు దాదాపు...
మరో రెండు స్థానాలకు మాత్రం అభ్యర్థులు ఎవరన్నది మాత్రం తేలకుండా ఉంది. పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఒక స్థానం ఇచ్చే అవకాశముందంటున్నారు. జీవన్ రెడ్డికి పార్టీకి సుదీర్ఘకాలం నుంచి నమ్మకంతో ఉండటంతో పాటు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. దీంతో పాటు ఆయన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలో పార్టీ హైకమాండ్ ఆయనను పిలిచి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గం కావడంతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన నేత కావడంతో ఆయకు ఛాన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. మరొక స్థానం ఎవరికన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
Next Story