Sun Mar 23 2025 22:24:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఒక్కసారిగా పెరిగిన విద్యుత్తు డిమాండ్.. సరఫరా కష్టమేనా?
తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్తు డిమాండ్ ఎక్కువవుతుంది

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్తు డిమాండ్ ఎక్కువవుతుంది. రోజురోజుకూ విద్యుత్తు వినియోగం పెరిగిపోతుంది. ఫ్యాన్లు, ఏసీలు ఆన్ లో ఉండటంతో ఒక్కసారిగా విద్యుత్తు డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేయాలన్న ఉద్దేశ్యంతో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఉక్కపోత కూడా విద్యుత్తు డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
గరిష్ట ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో అనేక జిల్లాల్లో 35 నుంచి 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శివరాత్రి కూడా వెళ్లిపోవడంతో రానున్న కాలంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్లు నిరంతరాయంగా వాడుతుండటంతో విద్యుత్తు వాడకం ఒక్కసారిగా పెరిగింది. మార్చి నెల రాకముందే గరిష్ట స్థాయిలో విద్యుత్తు వినియోగం అవుతుందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు.
నిన్నటి వరకూ...
నిన్నటి వరకూ తెలంగాణలో రోజుకు పదిహేను వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగేందంటున్నారు. కానీ నిన్న ఒక్కరోజే 16,500 మెగా వాట్ల విద్యుత్తు వాడకం జరగడంతో ఈ ఏడాది విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పీక్ అవర్స్ లో అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ, తిరిగి రాత్రికి విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుందని అధికారులు భావించి అందుకు తగినట్లుగాసరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Next Story