Wed Nov 06 2024 01:41:27 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla kavitha : నేడు తేలనున్న కవిత భవితవ్యం.. బెయిలా? జైలా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగిసింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగిసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈ నెల 15వ తేదీన బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత కోర్టు వారం రోజులు ఈడీ అధికారులకు కస్టడీకి ఇచ్చింది. తర్వాత ఈడీ తరుపున న్యాయవాదుల అభ్యర్థన మేరకు మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది. మొత్తం పది రోజుల పాటు కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నట్లయింది.
మరో రెండు రోజుల పాటు...
ఈరోజుతో కవిత కస్టడీ ముగియడంతో మరో రెండు రోజుల పాటు తమకు కస్టడీకి కవితను అప్పగించాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరనున్నారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలసి కవితను విచారించాల్సి ఉన్నందున, ఈ కీలక విచారణకు కవితను కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించనుంది. కవితను కస్టడీకి అప్పగిస్తే ఓకే లేకుంటే తీహార్ జైలుకు పంపే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
కవిత బెయిల్ పిటిషన్...
కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ చేస్తుందా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్ కోసం ట్రయల్ కోర్టును సంప్రదించాలని తెలిపింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ వేశారు. ఈ బెయిల్ పై నేడు విచారణ జరిపి బెయిల్ ఇస్తే ఓకే.. లేకుంటే మాత్రం తీహార్ జైలుకు కవితను తరలించే అవకాశాలున్నాయి.
Next Story