Sat Jan 04 2025 10:51:39 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవితక్కకు కష్టాలేనా.. రానంటే ఈసారి కుదురుతుందా?
బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని నిన్న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ విచారణకు తాను హాజరు కాలేనని కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అయితే ఈసారి ఈడీ రియాక్ష్ ఎలా ఉంటుందోనన్న టెన్షన్ నెలకొంది.
లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేశారు. తన వద్ద ఉన్న సెల్ ఫోన్లతో సహా అన్నీ కవిత ఈడీ అధికారులకు సమర్పించారు. అయితే ఆ తర్వాత మూడు సార్లు విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినా ఆమె హాజరు కాలేదు. ఇప్పుడు నోటీసులు జారీ చేయడం నాలుగో సారి. ఈసారి కూడా హాజరు కాలేనని చెప్పడంతో కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే అలాంటి చర్యలు చేపట్టదని న్యాయవాదులు అంటున్నారు.
ఎలాంటి చర్యకు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించుకుని విచారణపై కల్వకుంట్ల కవిత అభ్యంతరం తెలిపారు. మహిళను ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కవితకు అనుకూలంగానే ఆదేశాలు జారీ చేసింది. తనను ఇంటి వద్ద లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని పిటీషన్ లో కోరినట్లుగానే ఇప్పుడు విచారణను ఈడీ అధికారులు చేస్తారా? లేక మరేదైనా చర్యకు దిగుతారా? అన్న టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది.
గతానికి.. ఇప్పటికీ...
గతానికి, ఇప్పటికి రాజకీయాలు కూడా మారిపోయాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండేది. ముఖ్యమంత్రి కుమార్తెగా ఆమెకు ఒకింత వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. గత శాసనసభ ఎన్నికల్లో కవితను కేసు కూడా ప్రముఖంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగింది. అయితే బీజేపీకి మాత్రం గతంలో కంటే సీట్లు ఎక్కువగానే వచ్చాయి. ఒక్క స్థానం నుంచి ఎనిమిది స్థానాలకు బీజేపీ తెలంగాణలో పాకింది. అయితే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి ఈడీ నోటీసులు బీఆర్ఎస్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
Next Story