ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది
ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ముందు నుండి బలంగా ఉంది. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు కూడా మంచి పట్టు ఉంది. ఈ తరుణంలో పొంగులేటి వంటి బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవు. కాంగ్రెస్ బలం కూడా తప్పకుండా పుంజుకుంటుంది.
భారతీయ జనతా పార్టీ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. ఈటలతో పాటు ఇద్దరు ముఖ్యనేతలు తమ మొబైల్ ఫోన్లు, సొంత వాహనాలు, వ్యక్తి గత భద్రత సిబ్బందిని వదలిపెట్టి వేర్వేరు వాహనాల్లో ఓ ఫాంహౌస్ కు వెళ్లారు. బీజేపీ ముఖ్యనేతలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి దాదాపు రోజంతా సమావేశమై వివిధ సమీకరణాలు, చేరికలపై చర్చించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం బీజేపీ నేతలు కొత్త ఫోన్లు, సిమ్ లు ఉపయోగించారని కూడా తెలిసింది. ఈ భేటీ తర్వాత పొంగులేటి, జూపల్లి ఏ రాజకీయ పార్టీలోకి అడుగుపెడతారో తెలిసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదని తేలిపోయింది. ఈటల రాజేందర్ నిత్యం పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తోంది. ఈటల చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అంటున్నారు.