Thu Nov 21 2024 21:50:57 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపిన సంతోష్ కుమార్
బీఆర్ఎస్ లో టికెట్ ఆశించి చాలా మంది నాయకులు భంగపడ్డారు.
బీఆర్ఎస్ లో టికెట్ ఆశించి చాలా మంది నాయకులు భంగపడ్డారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడారు. పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ లేఖను సీఎం కేసీఆర్కు పంపారు. బంగారు తెలంగాణ కోసం కలిసి రావాలని సీఎం పిలుపుతో తాను కాంగ్రెస్ ను వీడి ఆ పార్టీలో చేరానని.. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కరీంనగర్ నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
కరీంనగర్ కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న సంతోష్ కుమార్ 2018లో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ కానీ, మరి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశించారు. కానీ ఇప్పటి వరకు అధికార పార్టీలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. చాలా రోజుల నుండి అసంతృప్తితో ఉన్న సంతోష్ కుమార్, ఎమ్మెల్యే టికెట్ ఏమైనా వస్తుందేమోనని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇక సంతోష్ కుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోసం ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీ చేసేందుకు ధరఖాస్తులో పేర్కొన్నారు. రేఖా నాయక్ తరఫున ఆమె పీఏ గాంధీభవన్ లో దరఖాస్తు చేశారు. ఆమె భర్త శ్యాం నాయక్ ఆసిఫాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ కు సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించారు.
Next Story