Mon Apr 21 2025 10:49:45 GMT+0000 (Coordinated Universal Time)
SlBC Accident : టన్నెల్ లో నిదానంగా పనులు.. సహాయక చర్యలకు అనేక ఆటంకాలు?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలో పేరుగాంచిన సంస్థలు రెస్య్చూ ఆపరేషన్ లో పాల్గొంటున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఆరుగురి ఆచూకీ కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతూనే ఉంది. పన్నెండు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ముందడగుపడటం లేదు. దీంతో లోపల చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబాలు మాత్రం తమ వారి మృతదేహాలయినా దొరుకుతాయా? లేదా? అన్న అనుమానం వారిలో బయలుదేరి ఆందోళన వ్యక్తమవుతుంది.
యాభై రోజులు గడుస్తున్నా...
ఫిబ్రవరి 22వ తేదీన శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగింది. అందులో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో రెండు మృతదేహాలను మాత్రమే ఇప్పటి వరకూ బయటకు తీసుకురాగలిగారు. 42 మంది ప్రాణాలతో బయటపడినా లోపల ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మార్చి 9వ తేదీన ఇంజీనిర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. మార్చి 25న మరో ఇంజినీర్ మనో జ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తేగలిగారు. మిగిలిన ఆరు మృతదేహాలు మాత్రం చిక్కడం లేదు. సహాయక బృందాలు మొత్తం మూడు షిఫ్ట్ లలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా సహాయక చర్యలు పూర్తి కాకపోవడంపై కార్మికుల బంధువులు పెదవి విరుస్తున్నారు.
శకలాల తరలింపు...
అయితే టీబీఎం మిషన్ శకలాల తరలింపు దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 173 మీటర్ల వరకూ శిధిలాలను తొలగించామని, మిగిలిన ఎనభ మీటర్ల దూరంలోనే మృతదేహాలు ఉండవచ్చని సహాయక బృందాలు చెబుతున్నాయి. అక్కడకు వెళ్లాలంటే టన్నెల్ పైభాగం నుంచి నీటి ఊట వస్తుండంతో చర్యలకు ఆటంకంగా మారింది. డీ1 , డీ2 పాయింట్లుగా గుర్తించిన సహాయక బృందాలు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. మట్టి, రాళ్లతో పాటు నీరు ఉబికి వస్తుండటంతో ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల మధ్య తవ్వకాలు జరపాలంటే కష్టంగా మారిందన్నది అధికారుల అభిప్రాయం. నిపుణుల సూచనలతోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story