Fri Dec 27 2024 03:20:23 GMT+0000 (Coordinated Universal Time)
18 ఏళ్లుగా దుబాయి జైల్లో మగ్గుతున్న ఐదుగురు
నేపాలీ సెక్యూరిటీ గార్డు మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యూఏఈ దేశం దుబాయిలో జైలు జీవితం గడుపుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అయిదుగురి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది.
18 ఏళ్లుగా దుబాయి జైల్లో మగ్గుతున్న ఐదుగురు
భారత రాయబారికి సీఎం కేసీఆర్ లేఖ
మంత్రి కేటీఆర్ చొరవతో దౌత్య ప్రయత్నాలు
నేపాలీ సెక్యూరిటీ గార్డు మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యూఏఈ దేశం దుబాయిలో జైలు జీవితం గడుపుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అయిదుగురి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మేరకు దుబాయి లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ (భారత రాయబారి) ఒక లేఖ రాశారు. మంత్రి కె. తారక రామారావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో మంగళవారం (05.09.2023) నాడు దుబాయిలో ఆగారు. ఇండియన్ కాన్సులేట్ అధికారులు, యూఏఈ జాతీయుడైన న్యాయవాది సల్మాన్ సబ్రి, సోషల్ వర్కర్స్ తో మంత్రి కేటీఆర్ సమావేశమై ఖైదీల విడుదలకు గల అవకాశాలపై చర్చించారు.
ఆరు నెలల క్రితం మంత్రి కేటీఆర్ తన కార్యాలయ అధికారులను, తెలంగాణ ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు ను దుబాయి పంపించారు. అధికారుల బృందం దుబాయి ఇండియన్ కాన్సులేట్ అధికారుల సాయంతో దుబాయి లోని అల్ అవీర్ జైలును సందర్శించారు. అరబ్ లాయర్ కు కావలసిన ఫీజును దాతలతో ఇప్పించారు.
సిరిసిల్ల మండలం పెద్దూరు కు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి అనే ఇద్దరు అన్నదమ్ములు, చందుర్తి కి చెందిన నాంపెల్లి వెంకటి (గొల్లెం నాంపెల్లి), కొనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మన్, మల్యాల మండలం మానాల కు చెందిన శివరాత్రి హన్మంతు అనే అయిదుగురు జీవిత ఖైదు (24 ఏళ్ల) శిక్ష పడి దుబాయి లోని అల్ అవీర్ సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు. వీరందరూ 'ఖల్లివెల్లి' (వీసా గడువు ముగిసిన అక్రమ నివాసులు) కార్మికులే. ఇదే కేసులో శిక్ష పడిన కొడిమ్యాల మండల నమిలికొండ (తురుకకాశీ నగర్) కు చెందిన సయ్యద్ కరీం ఎనిమిదేళ్ల క్రితం విడుదలయ్యాడు. నలుగురు పాకిస్తానీలు అంతకు ముందే విడుదలయ్యారు.
నేపాల్ లో ఉన్న మృతుడి కుటుంబానికి 'దియా' (బ్లడ్ మనీ) చెల్లించి 'క్షమాభిక్ష' పత్రం దుబాయి కోర్టులో దాఖలు చేస్తే ఖైదీల విడుదలకు మార్గం సుగమం అవుతందనే న్యాయవాది సూచనతో 2012 లో ఖైదీల కుటుంబ సభ్యులు నిధుల సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. బండలు కొట్టి జీవించే వడ్డెర కుటుంబాలకు చెందిన వీరికి లక్షలాది రూపాయల నిధుల సమీకరణ అసాధ్యం అయ్యింది. నిధుల సమీకరణకు తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని దుబాయి జైల్లో మగ్గుతున్న ఆరుగురు ఖైదీల భార్యలు గల్ఫ్ కార్మిక నాయకులు పి.నారాయణ స్వామి, మంద భీంరెడ్డి ల నాయకత్వంలో హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన వెంకట సాయి మీడియా, హాత్ వే కమ్యూనికేషన్స్ అధినేత సిహెచ్. రాజశేఖర్ రూ.15 లక్షల చెక్కును విరాళంగా ఇచ్చారు.
2013 లో అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్, గల్ఫ్ కార్మిక నాయకులు పి. నారాయణ స్వామి, మంద భీంరెడ్డి నేపాల్ కు వెళ్లి మృతుడు దిల్ ప్రసాద్ రాయ్ భార్య దిల్ కుమారి రాయ్ కు రూ.15 లక్షల చెక్కు ఇచ్చి ఆమె నుంచి 'క్షమాభిక్ష' పత్రం తీసుకున్నారు. కేసులో ఉన్న సంక్లిష్ట కారణంగా వీరి క్షమాభిక్ష పిటిషన్ ను పై కోర్టు రెండు సార్లు తిరస్కరించింది. నేపాల్ పౌరుడి మృతి అనుకోకుండా జరిగిందని, కావాలని చేసింది కాదని, అరబిక్ భాష రాకపోవడంతో తమ కేసును సరిగా వాదించుకోలేకపోవడం, గత 15 ఏళ్లుగా సత్ప్రవర్తన కలిగి ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకొని రాయల్ కోర్టు (రాజు గారి దర్బార్) క్షమాభిక్ష ప్రసాదించేలా దౌత్యపరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఏఈ, భారత్ మధ్య 2011 నవంబర్ 2న జరిగిన ఖైదీల బదిలీ ఒప్పందం ప్రకారం దుబాయి జైలు నుంచి హైదరాబాద్ జైలుకు బదిలీ చేసి మిగతా శిక్షాకాలం ఇక్కడ గడిపే అవకాశం కూడా ఉన్నది.
2005 నుంచి చాలా మంది సామాజిక కార్యకర్తలు వీరి విడుదలకు ప్రయత్నించారు. దుబాయి లోని న్యాయవాది అనురాధ, హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది పి. శశి కిరణ్, సిరిసిల్లకు చెందిన కె.కె. మహేందర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎన్నారై సెల్ చైర్మన్ వెంకట్ మేడపాటి, సిరిసిల్ల జర్నలిస్టులు తడుక నాగభూషణం, బాలు కాయితి, దుబాయి లోని సోషల్ వర్కర్స్ వై. శ్రీనివాస శర్మ, జువ్వాడి శ్రీనివాస రావు, సలావుద్దీన్ ల బృందం పని చేసింది. నేపాల్ లోని మృతుని కుటుంబ సభ్యులతో అనుసంధానం చేయడానికి మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) సభ్యులు బిష్ణు బి ఖత్రి లు ప్రత్యేకంగా కృషి చేశారు.
Next Story