Mon Dec 23 2024 06:59:18 GMT+0000 (Coordinated Universal Time)
స్టిక్కర్ల రూపం మారుతోంది
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్టిక్కర్ల రూపం మారనుంది. ఇకపై స్టిక్కర్లపై వారి పేర్లు, వాహనం నెంబరు కూడా నమోదవుతుంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్టిక్కర్ల రూపం మారనుంది. ఇకపై స్టిక్కర్లపై వారి పేర్లు, వాహనం నెంబరు కూడా నమోదవుతుంది. స్టిక్కర్ ఎంత వరకూ ఉపయోగించవచ్చనేది కూడా దాని మీదే పేర్కొంటారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్టిక్కర్లు అనేక కేసుల్లో ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ రేప్ కేసులోనూ నిందితులు ఉపయోగించిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది.
స్టిక్కర్ల దుర్వినియోగం....
అలాగే యాక్సిడెంట్ కేసుల్లోనూ స్టిక్కర్ల రగడ మామూలుగా లేదు. బంజారాహిల్స్ లో ఒక కారు ఢీకొట్టిన కేసులో వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ గా గుర్తించారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో క్యాసినోలు నిర్వహిస్తున్న మాధవరెడ్డి వాహనానికి కూడా మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉంది. ఇది పెద్దయెత్తున ప్రచారం అయింది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
అందుకే మార్పు....
దీంతో స్టిక్కర్ల ను పూర్తి స్థాయిలో మార్చాలని నిర్ణయానికి వచ్చారు. ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్టిక్కర్లు ఇస్తారు. దీనికి ఒక ఏడాది టైం ఉంటుంది. ప్రతి సభ్యుడికి ఐదు స్టిక్కర్లను ప్రభుత్వం ప్రతి ఏడాది సరఫరా చేస్తుంది. ఈ స్టిక్కర్లను వారి వాహనాలకే వినియోగించాలి. కానీ తప్పు దోవ పడుతుండటంతో స్టిక్కర్లపై ఇకపై వాహనం నెంబరుతో పాటు, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పేరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్టిక్కర్ల గడువు తేదీని కూడా స్టిక్కర్ పై నమోదు చేస్తారు. కాలపరిమితి ముగిసిన వెంటనే దానిని తొలగించి కొత్త స్టిక్కర్ వేసుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
Next Story