Mon Dec 23 2024 03:20:01 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ మరో విఫల ప్రయోగానికి సిద్ధమయ్యారా? లేకపోతే అక్కడకు వెళ్లి స్టడీ ఏంటి?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల్లో దిట్ట అంటారు. ఆయన ఉద్యమ నేతగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల్లో దిట్ట అంటారు. ఆయన ఉద్యమ నేతగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీని కింది స్థాయి నుంచి తీసుకు వచ్చి రెండు సార్లు తెలంగాణాలో జయకేతనం ఎగుర వేశారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ వ్యూహాలు పనిచేయలేదు. దారుణ ఓటమిని చవి చూశారు. పార్టీ నేతలు కూడా ఓటమి తర్వాత పార్టీని విడిచి వెళుతున్నారు. తాను నమ్ముకున్న నేతలు, అధికారంలో ఉండగా పదవులు ఇచ్చిన లీడర్లే పార్టీని కాదనుకుని వెళ్లిపోతున్నారు. మరోవైపు కిందిస్థాయిలో ఉన్న క్యాడర్ కూడా బీజేపీ వైపు వెళుతుంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో జీరో స్థానాలు రావడంతో కేసీఆర్ క్రెడిబిలిటీ మీదనే అనుమానాలు బయలుదేరాయి.
క్షేత్రస్థాయి నుంచి...
అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అయితే ఆయన పార్టీని బలోపేతం చేయడం ఎలాగో తెలియని విషయం కాదు. ఆయనకు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. క్యాడర్ ను ఎలా తెచ్చుకోవాలో? పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు మించి తెలిసిన వారు ఎవరూ లేరు. కానీ ఎందుకో కేసీఆర్ మస్కిష్కంలో ఆలోచనలకు పదును తగ్గాయని అంటున్నారు. బీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆయన వద్ద ఎలాంటి వ్యూహాలు లేవు. ఆలోచనలు లేవు. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
తమిళనాడుకు ప్రత్యేక బృందం...
కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఏం చేయాలో తెలియక.. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే తమిళనాడుకు బీఆర్ఎస్ నేతలతో కూడిన ప్రత్యేక బృందాన్ని పంపారు. బీఆర్ఎస్ నేతలు తమిళనాడుకు వెళ్లి అక్కడ డీఎంకే పార్టీ బలోపేతం కోసం తీసుకున్న చర్యలు, పార్టీ అగ్రనాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై స్టడీ చేయనున్నారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అది ఏ ఎన్నికల్లోనైనా గెలుస్తూ వస్తుంది. శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే జెండా ఎగురవేసింది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా సత్తా చాటింది.
రెండు ప్రాంతాలకు...
దీంతో కేసీఆర్ ఇప్పుడు డీఎంకే పార్టీ విధానాలపై స్టడీ చేయడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని పంపారంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ, తమిళనాడుకు పూర్తి విరుద్ధం. అక్కడ డీఎంకేకు సరైన ప్రత్యర్థి లేరు. పైగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు. అక్కడి సంస్కృతి వేరు. తెలంగాణలో సంస్కృతి వేరు. రెండు విభిన్నమైన రాష్ట్రాలు. తమిళనాడులో ఏదైనా అతిగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తెలంగాణలో తెలివైన నిర్ణయాలు ప్రజలు ఎప్పటికప్పుడు తీసుకుంటారు. అందుకే కేసీఆర్ మరో విఫల ప్రయోగానికి రెడీ అవుతున్నారా? అన్న అనుమానం వ్యక్తమవుతుంది.
Next Story