Mon Dec 23 2024 03:25:20 GMT+0000 (Coordinated Universal Time)
Sabitha Indra Reddy : సబిత టార్గెట్ అయ్యారా? లేక అసలు విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికేనా?
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపాయి.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలు ఆమె సభలో బయటపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పార్టీ మారాలని కోరారని, భవిష్యత్ ఉంటుందని చెప్పారని సబిత అనడం రాజకీయ వర్గాల్లో ఒకింత ఇబ్బందికరంగా మారింది. సబిత ఇంద్రారెడ్డి ఈ కామెంట్స్ ఆవేశంగా చేశారా? లేక కావాలనే ఆ కామెంట్స్ సభలో చేశారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. దాదాపు పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లో పదవులు పొంది...
తిరిగి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు టచ్ లోకి వెళ్లిపోయారు. ఎవరి ఇష్టం వారిది. గతంలోనూ బేరసారాలు జరిగాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి అధికార పార్టీలో చేరారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ సబిత ఇంద్రారెడ్డికి తక్కువేమీ చేయలేదు. మంత్రి పదవులు ఇచ్చింది. వైఎస్ హయాంలో అయితే చేవెళ్ల చెల్లెమ్మగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వైఎస్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా చేవెళ్ల నుంచి మొదలుపెట్టేవారు. అలాంటి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె పార్టీని వదిలి వెళ్లినప్పుడు ఆమెపై విమర్శలు వచ్చాయి. అన్నీ ఇచ్చిన పార్టీని మంత్రి పదవి కోసమే సబితమ్మ బీఆర్ఎస్ లోకి వెళ్లారన్న దానికి నాడు సమాధానం కూడా దొరికింది.
స్వయంగా అంగీకరించి...
అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకున్న కుటుంబ, రాజకీయ పరిచయాలతో సబిత ఇంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఉండవచ్చు. దానిని ఎవరూ కాదనరు. తాను ఆహ్వానించిన మాట వాస్తవమేనని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోనే అంగీకరించారు. అంటే నమ్మకం మీదనే సబితమ్మను పార్టీలోకి రేవంత్ ఆహ్వానించి ఉండవచ్చు. అయితే నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టడం అంటే రాజకీయంగా కొంత సబితా ఇంద్రారెడ్డి విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లే. తనను రేవంత్ రెడ్డి ఆహ్వానించిన విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెప్పిఉండవచ్చు. మార్కులు కొట్టేయవచ్చు.
నేరుగా ఆరోపణలు...
అందులో ఎలాంటి తప్పులేదు. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై నేరుగా ఆరోపణలు చేయడం చూస్తుంటే సబిత ఇంద్రారెడ్డి పార్టీలో రాజకీయంగా ఇంకా ఏదో ఆశిస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గులాబీ పార్టీలో ఆమె కొనసాగాలనుకోవాలనుకోవడం ఆమె వ్యక్తిగత విషయం. దానిని ఎవరూ తప్పుపట్టరు. కూడా కానీ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి మారినప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు ఆ పార్టీ అధినేత మీద చేసి ఉంటే కొంత ప్రజలు విశ్వసించేవారు. తెలంగాణలో పార్టీలు మారడం ఒక సహజ ప్రక్రియలా మారింది. కేవలం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి ఈరోజు చేసిన కామెంట్స్ తో కొంత రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి.
Next Story